
చికిత్స పొందుతూ యువకుడు మృతి
సైదాపూర్: సోమారం గ్రామ పంచాయతీ పరిధిలోని బూడిదపల్లిలో గడ్డి మందు తాగిన అమరగొండ రాహుల్(20) అనే యువకుడు శనివారం చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సైదాపూర్ ఎస్‌ఐ తిరుపతి తెలిపారు. ఎస్‌ఐ, గ్రామస్తుల కథనం ప్రకారం.. విజయ–కొమురయ్య ఏకై క కుమారుడు రాహుల్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. 4 రోజుల నుంచి జ్వరంతో బాధ పడుతున్నాడు. ఆస్పత్రిలో చూపించడం లేదని ఇంట్లో గొడవ పడ్డాడు. మనస్తాపం చెంది ఆగస్టు 15న సాయంత్రం వ్యవసాయ పొలాల వద్ద గడ్డి మందు తాగాడు. చికిత్స కోసం హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. కాగా రాహుల్ గడ్డి మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. హాయిగా చనిపోతున్నాను.. ఎప్పుడో చచ్చిపోదామనుకున్నా.. ఈరోజు అవకాశం వచ్చిందంటూ నవ్వుతూ గడ్డి మందు తాగే వీడియో గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూపులో వైరలైంది. నవ్వుతూ తిరిగే రాహుల్ ఆత్మహత్యకు పాల్పడడం గ్రామస్తుల హృదయాలను కలచివేసింది.
హుజూరాబాద్: పట్టణానికి చెందిన పంజాల కృష్ణ(42) ఈనెల 3న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. కృష్ణ హుజురాబాద్‌కు చెందిన వనం హరీశ్‌కు రూ.25లక్షలు అప్పుగా ఇచ్చాడు. గత 15నెలలుగా అసలు, వడ్డీ ఇవ్వడం లేదు. ఇటీవల డబ్బుల కోసం అడగగా, ఇవ్వననడంతో మనస్తాపానికి గురై పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్‌లో ఈనెల 3న రాత్రి తన చావుకు హరీశ్ కారణమని సెల్ఫీ వీడియో తీశాడు. అనంతరం పురుగుల మందుతాగాడు. చావు బతుకుల మధ్య ఉన్న కృష్ణను హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం జమ్మికుంట, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కృష్ణ భార్య హర్షిత పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.

చికిత్స పొందుతూ యువకుడు మృతి