
మొదటి జెండా ఎగిరింది ధర్మపురిలోనే..
ధర్మపురి: నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి, స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తింపు పొందిన జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన కేవీ.కేశవులు, మాణిక్యశాస్త్రి ప్రాణస్నేహితులు. కేశవులు ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగల్‌రావు హయాంలో చేనేత జౌళిశాఖ మంత్రిగా కొనసాగారు. 1947లో ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు ధర్మపురిలోని గోదావరి ఒడ్డునున్న కర్నెఅక్కెపెల్లి భవనంపై తన మిత్రుడైన మాణిక్యశాస్త్రితో కలిసి మొట్టమొదటి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఎగురవేయడం నిషేధమని అప్పటి నిజాం ప్రభుత్వం కేశవులను బంధించడానికి ప్రయత్నించగా.. నిండుగా ప్రవహిస్తున్న గోదావరిలోంచి వెళ్లి తప్పించుకున్నారు. ఏడాదిపాటు ముంబయిలో తలదాచుకున్నారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం రోజు తిరిగి ధర్మపురికి చేరుకున్నారు. 2019 జనవరి 30న అనారోగ్యంతో మృతి చెందారు.