
పునరావాసం ఏర్పాట్లు చేసుకోండి
● కలెక్టర్ సత్యప్రసాద్
ఇబ్రహీంపట్నం: గోదావరి ఉధృతంగా ప్రవహించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పరీవాహక ప్రాంతాల ప్రజల కోసం ముందస్తు పునరావాస ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి వద్ద గోదావరి ప్రవాహాన్ని పరిశీలించారు. గోదావరి ఉధృతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఇరిగేషన్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి మనోజ్‌కు సూచించారు. గతేడాది వడగండ్ల వర్షాలతో నష్టపోయిన తమకు ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదని రైతు తెడ్డు రాజరెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పరిహారం డబ్బులు వచ్చాయని, త్వరలోనే జమ చేస్తామని కలెక్టర్ తెలిపారు. మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో ఎండీ.సలీమ్, ఇరిగేషన్ డీఈ దేవనందం, ఆర్‌ఐ రమేశ్ ఉన్నారు.
మద్దుల చెరువు పరిశీలన
కోరుట్ల: పట్టణంలోని మద్దులచెరువును కలెక్టర్ బి.సత్యప్రసాద్ పరిశీలించారు. గురువారం ‘వరద ముంపు ముప్పు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఆయన చెరువు కట్టను పరిశీలించారు. మత్తడి వద్దకు వెళ్లి మున్సిపల్ కమిషనర్ రవీందర్, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. వరద మళ్లింపునకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణచైతన్య, ఇరిగేషన్ ఏఈ సిరాజ్ ఉన్నారు.

పునరావాసం ఏర్పాట్లు చేసుకోండి