మంజూరు చేస్తారో.. లేదో..!
మల్లాపూర్/పెగడపల్లి: పేదలకు సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం రూపొందించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అందని ద్రాక్షలా మారనుంది. వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అధికారులు గ్రామాల్లో సర్వే చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆశావహులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వే జాబితాల్లో చాలా చోట్ల అర్హుల పేర్లు లేవని ఆందోళన మొదలైంది. అలాగే కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకుంటుండడంతో తమకు ఇళ్లు మంజూరు చేస్తారో లేదోనని ఆవేదన చెందుతున్నారు. పార్టీలకతీతంగా ఇళ్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.
పెరిగిన నాయకుల జోక్యం..?
● ఇళ్ల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఆయా గ్రామాల్లో పలుకుబడి ఉన్న కాంగ్రెస్ నాయకులు కలిసి జాబితా తయారు చేసి అధికారులకు అందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇళ్ల మంజూరులో కాంగ్రెస్ నాయకుల జోక్యం పెరిగిపోయిందని, దీంతో నిరుపేదలను గుర్తించి వారికి ఇళ్లు మంజూరు చేస్తారా? లేదా కాంగ్రెస్ నాయకులకే కేటాయిస్తారా? అనే అనుమానం ప్రజల్లో నాటుకుపోయింది. అయితే అధికారులు మాత్రం ప్రభుత్వ నిబంధనల మేరకు ఇళ్లు మంజూరవుతాయని, అర్హులు ఆందోళన చెందవద్దని పేర్కొంటున్నారు.
● ధర్మపురి నియోజవర్గంలోని ప్రతి మండలానికి 400–500 ఇళ్లు మంజూరు కానున్నాయి. మండలవ్యాప్తంగా స్థలం ఉండి ఇళు్‌ల్ కావాలని 4,486 మంది, స్థలంతో పాటు ఇళ్లు అవసరమున్నవారు 1642 మంది దరఖాస్తు చేసుకున్నారు. మండలంలోని ల్యాగలమర్రిని పైలట్ గ్రామంగా ఎంపిక చేసి 87 ఇళ్లు మంజూరు చేశారు.
● మల్లాపూర్ మండలంలో 23 గ్రామ పంచాయతీలకు మొత్తం 725 మంది జాబితా విడుదల చేసి సర్వే చేశారు. మండల వ్యాప్తంగా 11,649 దరఖాస్తులు వచ్చాయి. పైలట్ ప్రాజెక్ట్ కింద కొత్తదాంరాజుపల్లి గ్రామాన్ని ఎంపిక చేయగా, ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 427 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 45 మందిని అర్హులుగా తేల్చారు. వీరిలో ఇప్పటి వరకు 15 మంది ఇంటి నిర్మాణాలు ప్రారంభించారు.
వేలల్లో దరఖాస్తులు.. వందల్లో సర్వే ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై అర్జీదారుల్లో ఆందోళన
‘ఈ ఫొటోలోని వృద్ధ దంపతులు బట్టు భూమక్క–శంకర్. ఊరు మల్లాపూర్ మండలం రాఘవపేట. గ్రామంలో చిన్న గుడిసెలో నివాసముంటారు. అది వర్షానికి, ఈదురుగాలులకు ఎప్పుడూ కూలిపోతుందో తెలియని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇటీవల ఇందిరమ్మ ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే సర్వే జాబితాలో వీరి పేరు లేకపోవడంతో తమకు ఇల్లు మంజూరు చేస్తారో లేదోనని ఆందోళన చెందుతున్నారు. తమ గోడు చూసైనా.. సర్కార్ గూడు కల్పించాలని వేడుకుంటున్నారు’.
మంజూరు చేస్తారో.. లేదో..!


