చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
రాయికల్: రైతులకు ఇబ్బందులు కలగనీయకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మండలంలోని అల్లీపూర్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. గన్నీ సంచులు, లారీల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సింగిల్ విండో చైర్మన్ రాజలింగం, తహసీల్దార్ ఖయ్యూం, సీఈవో ఉపేందర్, నాయకులు ముఖీద్, తిరుపతిగౌడ్, మోర వెంకటేశ్, రత్నాకర్‌రావు, రామన్న, రవి, జీవన్‌రెడ్డి, గంగారాం, శంకర్ పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయించండి
జగిత్యాలరూరల్: జగిత్యాలరూరల్ మండలం క న్నాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు కన్నాపూర్, కుర్మపల్లి రైతులు వినతిపత్రం సమర్పించారు. స్పందించిన ఎమ్మెల్యే కలెక్టర్, ఉన్నతాకారులతో మాట్లాడారు. కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
సైన్స్ ప్రయోగశాలకు భూమిపూజ
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని బాలికల హైస్కూల్‌లో రూ.13.5 లక్షలతో నిర్మించనున్న సైన్స్ ప్రయోగశాలకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని, విద్యాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. డీఈవో రాము, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి, మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, హెచ్‌ఎం రామానుజం, తపస్ జిల్లా అధ్యక్షుడు దేవయ్య పాల్గొన్నారు.
డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పరిశీలన
నూకపల్లిలో నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ఎమ్మెల్యే బుధవారం పరిశీలించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 4,520 ఇళ్లను నిర్మించామన్నారు. నూకపల్లి కాలనీని జగిత్యాల మున్సిపాలిటీలో విలీనం చేశామన్నారు. దాదాపు 25 వేల మంది పేదలకు వసతి కల్పించాలన్న లక్ష్యంగా ఇళ్లు నిర్మించామని తెలిపారు.


