జగిత్యాలక్రైం: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 14 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలకు పోలీసు శాఖ మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
నృసింహుని సన్నిధిలో భక్తుల రద్దీ
ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వచ్చిన వారికి నీడ, నీటి వసతి, లడ్డూప్రసాదాలను అందుబాటులో ఉంచారు. భక్తులు తలనీలాలు సమర్పించారు. కోడెమొక్కు చెల్లించుకున్నారు.
‘ధరణి’ దరఖాస్తులు పరిష్కరించాలి
జగిత్యాల: ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమావేశమయ్యారు. పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులన్నింటినీ ఈనెల చివరి వరకు పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మహిళారైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు
జగిత్యాలఅగ్రికల్చర్: మహిళా రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు అందించనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ తెలిపారు. కేంద్రప్రభుత్వ వ్యవసాయ యాంత్రీకరణ ఉప పథకం కింద పరికరాల కోసం జిల్లాకు రూ.78.79 లక్షలు మంజూరయ్యాయని, ఈనెల 25లోపు లబ్ధిదారులను ఎంపిక చేసి యంత్రాలను కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు 40శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 రాయితీపై పరికరాలు అందిస్తామని, బ్యాటరీ స్ప్రేయర్స్ 101, పవర్ స్ప్రేయర్లు 102, డ్రోన్ –1, రోటోవేటర్ 51, సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ 12, కల్టీవేటర్ 67, బండ్‌ఫార్మర్ 4, పవర్‌వీడర్ 2, బ్రష్ కట్టర్ 5, పవర్ టిల్లర్ 3, ట్రాక్టర్లు 3, స్ట్రాబలర్స్ 2 చొప్పున అందించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను ఆయా మండలాల వ్యవసాయాధికారులకు అందించవచ్చని తెలిపారు.
కలెక్టరేట్ వద్ద వంటావార్పు
జగిత్యాలటౌన్: ఎన్నిల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు అంగన్‌వాడీ టీచర్లను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ అనుబంధం అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన 48గంటల ధర్నాలో మాట్లాడారు. కేంద్రం తెచ్చిన నూతన జాతీయ విద్యావిధాన చట్టం అమలైతే ఐసీడీఎస్‌లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని, తద్వారా ఐసీడీఎస్ మూతపడే పరిస్థితి వస్తుందన్నారు. అనేక హామీలతో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ కేంద్రం నిర్ణయాలను అమలు చేసేందుకు యత్నిస్తోందన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, జిల్లా కో–కన్వీనర్ కోమటి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి స్వప్వ, జయప్రద, సరిత, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.
కలెక్టరేట్ వద్దే భోజనం, నిద్ర
ఉద్యోగ భద్రత, హామీల అమలు డిమాండ్‌తో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు రాత్రిపూట కూడా నిరసన వ్యక్తం చేశారు. శిబిరం వద్దే వంటావార్పు నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుటగల రోడ్డుపైనే రాత్రి నిద్రపోయారు.
బాధితులకు సత్వర న్యాయం చేయాలి
బాధితులకు సత్వర న్యాయం చేయాలి


