విదేశాలకు వెళ్లాలని ఆశ.. దళారులతో గోస..

- - Sakshi

జగిత్యాల: విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసాలు పెరిగిపోతున్నాయి. భారీ వేతనాలను ఆశ చూపుతూ రూ.లక్షలు వసూలు చేస్తున్న కొందరు దళారులు ఆ తర్వాత ముఖం చాటేస్తున్నారు. జిల్లాలో దాదాపు ప్రతీ గ్రామం నుంచి ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్తుంటారు. అయితే కరోనా వల్ల అక్కడ ఉపాధి కోల్పోయి వేలాది మంది స్వగ్రామాలకు వచ్చారు. కొంతకాలంగా పరిస్థితులు మెరుగుపడడంతో గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లో ఉపాధికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని పలువురు మోసాలకు పాల్పడుతున్నారు.

మెట్‌పల్లి మండలం వేంపేటకు చెందిన యువకుడు న్యూజిలాండ్‌ వెళ్లడానికి ఢిలీలోని ఓ కన్సల్టెన్సీని సంప్రదించాడు. దాని నిర్వాహకుల సూచనతో ముందుగా రూ.3.50లక్షలు చెల్లించాడు. తర్వాత స్వగ్రామానికి వచ్చిన యువకుడు కొన్ని రోజులకు వారికి ఫోన్‌ చేయగా ఆ నంబర్‌ పని చేయలేదు. చివరకు ఢిల్లీకి వెళ్లి చూడగా అప్పటికే వారు బోర్డు తిప్పేశారు. గత్యంతరం లేక మరో రూ.లక్ష ఖర్చు చేసి కువైట్‌ వెళ్లాడు.

రూ.లక్షల వేతనాలని ఆశ చూపుతూ..

► గల్ఫ్‌ దేశాల్లో లేబర్‌ పనులకు రూ.20వేల నుంచి మొదలుకొని అత్యధికంగా రూ.50వేలకు మించి వేతనాలు లభించవు. ఇందుకు ఏజెంట్లు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు.

► మలేసియా, సింగాపూర్‌, మాల్టా, ఆస్ట్రేలియా, న్యూజిలాంగ్‌, లిబియా, కెనడా తదితర దేశాల్లో రూ.లక్షన్నర నుంచి మొదలుకొని రూ.రెండు లక్షల వరకు వేతనాలు అందుతాయనే ప్రచారం ఉంది. వీసా కోసం బ్రోకర్లు రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు వసూలు చేస్తున్నారు.

► ఆయా దేశాలకు వెళ్లడం ఖర్చుతో కూడుకున్నది అయినా రూ.లక్షల్లో వేతనాలు వస్తాయనే ఆశతో యువకులు అప్పు చేసి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.

► ఈ దేశాలకు హైదరాబాద్‌, చైన్నె, ఢిల్లీల్లో ఉన్న కన్సల్టెన్సీల ద్వారా స్థానిక బ్రోకర్లు పంపుతున్నారు. జిల్లాలో ఇప్పటికే వందలాది మంది ఆయా దేశాలకు వెళ్లినట్లు తెలిసింది.

ఎన్నో విధాలుగా మోసాలు

► రూ.లక్షల వేతనాల కోసం ఆయా దేశాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న వారిలో పలువురు కన్సల్టెన్సీలు, బ్రోకర్ల చేతిలో మోసాలకు గురవుతున్నారు.

► కన్సల్టెన్సీలు ముందుగానే వీసా ప్రక్రియ కోసం రూ.లక్షలు వసూలు చేసి ఆ తర్వాత పంపకుండా చేతులెత్తెస్తున్నాయి.

► మరోవైపు ఇతర దేశాలకు వెళ్లడానికి అవసరమైన విద్యార్హతలు లేని వారి కోసం బ్రోకర్లు నకిలీ సర్టిఫికెట్లను కూడా తయారు చేస్తున్నారు.

► ఇటీవల బ్రిటన్‌ వెళ్లడానికి ప్రయత్నించిన మెట్‌పల్లి యువకుడికి సంబంధింత బ్రోకర్‌ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌ తయారు చేశాడు. ఈ విషయాన్ని సదరు యువకుడు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బ్రోకర్‌తో పాటు అతడికి సహకరించిన మరో వ్యక్తిపై కేసు నమోదైంది.

Read latest Jagtial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top