జగిత్యాల: పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పచ్చదనం, పరిశుభ్రమైన బల్దియా లక్ష్యంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపొందించినట్లు జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి తెలిపారు. చైర్‌పర్సన్ సమిండ్ల వాణి అధ్యక్షతన గురువారం మున్సిపల్ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. రూ.83.99కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా.. కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. పట్టణంలో గ్రీన్ కవరేజీ పెంచడానికి రూ.3.37 కోట్లు, పారిశుధ్య నిర్వహణకు రూ.3.9 కోట్లు, వసతుల కల్పన, పార్క్‌లు, మురికివాడల అభివృద్ధి, ఆటస్థలాలు, పబ్లిక్ టాయిలెట్స్, ఓపెన్ జిమ్స్, స్ట్రీట్ వెండర్స్, జంతువధశాలల నిర్మాణాలకు రూ.8.53 కోట్లు కేటాయించారు. మిగులు బడ్జెట్‌లో 1/3 వంతు నిధులు రూ.2.84 కోట్లు వెనుకబడిన తరగతులు, మైనార్టీలు, మురికివాడలు, అభివృద్ధి దశలో ఉన్న ప్రాంతాలు, కొత్తగా విలీనమైన ప్రాంతాలకు కేటాయించారు.
జగిత్యాలకు అత్యధిక నిధులు
రాష్ట్రంలో ఏ మున్సిపాలిటికీ రానన్ని జగిత్యాలకు తెచ్చామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. వాటితో అభివృద్ధి పనులు వేగవంతంగా చేయాలని, పన్నులు సకాలంలో చెల్లించేలా చూడాలని అధికారులు పేర్కొన్నారు. ప్రణాళికబద్ధంగా చెరువులు, కుంటలను అభివృద్ధి చేస్తూ ముందుకెళ్లాలన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్ మాట్లాడుతూ ప్రాధాన్యక్రమంలో నిధులు వెచ్చిస్తూ మున్సిపాలిటీని అభివృద్ధిపర్చాలని, పన్నుల వసూళ్లకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన, అకౌంట్స్ ఆఫీసర్ గణేశ్, డిప్యూటీ ఈఈ ఆనంద్, టౌన్‌ప్లానింగ్ అధికారి శ్రీనివాస్, ఏఈలు అనిల్, లక్ష్మీ పాల్గొన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
జగిత్యాలటౌన్: క్రీడలు మానసికోల్లాసం కలి గిస్తాయని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి అస్మి త లీగ్ పోటీలను ప్రారంభించారు. క్రీడల అభివృద్ధికి పాటుపడుతున్నామని తెలిపారు. ఇండోర్ స్టేడియంలో బాక్సింగ్, షటిల్ కోసం వసతులు కల్పించామన్నారు. అదనపు కలెక్టర్ బీఎస్.లత, యువజన, క్రీడల అధికారి రవికుమార్, కౌన్సిలర్ అరవ లక్ష్మి, సిరిసిల్ల శ్రీనివాస్, పీడీలు విశ్వప్రసాద్, పీఈటీలు క్రిష్ణప్రసాద్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.


