పెగడపల్లి: గూడులేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ పథకం కింద ఇంటిని నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మండలంలోని నంచర్లలో సాయిళ్ల సూరమ్మ, ముని దంపతులు నిర్మించిన ఇంటిని గురువారం ప్రారంభించారు. నియోజకవర్గంలో మొదటి విడత 3500 గృహాలు మంజూరు చేశామని, అవన్నీ పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని సూచించారు. నంచర్ల నుంచి పెగడపల్లి యాపల్ చెరువు ఉన్న రహదారితోపాటు శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో కల్యాణమండపం, వంటశాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములుగౌడ్, సర్పంచ్ కుంటాల వనజ, హౌసింగ్ పీడీ ప్రసాద్, ఏఈ జ్యోతి, ఉప సర్పంచ్ ఎడ్ల శ్యాంసుందర్‌రెడ్డి, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.
ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తాం
ధర్మపురి: గ్రామీణులకు సేవలందిస్తున్న ఆశవర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆశవర్కర్ల తమ సమస్యలపై మంత్రికి వినతిపత్రం సమర్పించారు. వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న ప్రతిఒక్కరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు.


