● ఓ కేకు.. స్టేజీ.. డీజే సాంగ్స్.. ఇలా చిన్నపాటి ఖర్చులు లెక్కిస్తే మొత్తం అక్షరాల రూ.లక్ష. ఇదంతా కేవలం ఒక్కరోజు మహిళా దినోత్సవం నిర్వహించడానికి వెచ్చించిన ఖర్చు.
● 50మందికి టోపీలు..బనియన్లు ఇచ్చి పట్టణ ప్రగతి ప్రణాళిక పేరిట 2కే రన్ నిర్వహించి దాని కోసం చేసిన ఖర్చు రూ.70 వేలు.
కోరుట్ల: ఇళ్లల్లో లేని నల్లాలకు బిల్లులు వసూలు చేసి.. ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి ఆస్తిపన్ను వసూళ్లలో పక్కాగా వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు.. వచ్చిన ఆదాయాన్ని ఆదా చేయడంలో విఫలమవుతున్నారు. దీనికి ఇటీవల నిర్వహించిన మహిళా దినోత్సవం.. 2కే రన్ కార్యక్రమాలు.
రూ.లక్ష ఖర్చు చేశారా..?
మహిళలను ప్రోత్సహించడానికి మహిళా దినో త్సవం ఘనంగా నిర్వహించాల్సిన అవసరముంది. బల్దియా ఆవరణలో ఈనెల 8న వేదిక ఏర్పాటు చేశారు. మున్సిపల్ ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఆర్పీలు ఇతరత్రా అంతా కలిసి 70 మంది వరకు పాల్గొన్నారు. మున్సిపల్ ఆవరణలో ఓ టెంట్, స్టేజీ, కుర్చీలు వేసి కేక్ కట్ చేశారు. డీజే ఏర్పాటు చేశారు. ఆర్పీలకు చీరలు పంపిణీ చేశారు. మొత్తం ఖర్చు ఏతావాతా రూ.40వేల నుంచి రూ.60 వేలలోపు ఉంటుందని సమాచారం. దీనికి మున్సిపల్ అధికారులు మాత్రం మొత్తం రూ.లక్ష ఖర్చు చూపినట్లు సమాచారం.
2కే రన్‌కు రూ.70 వేలు
మూడు రోజుల క్రితం పట్టణంలోని 2కే రన్ నిర్వహించారు. కృష్ణాలయం నుంచి నంది చౌరస్తా వరకు చేపట్టారు. ఈ రన్‌లో పాల్గొన్న వారికి టోపీలు, బనియన్లను మున్సిపల్ తరఫున అందించారు. వీటికి ఖర్చు మొత్తంగా రూ.70 వేలుగా చూపారు. ఈ బిల్లుల ఆమోదం కోసం శుక్రవారం నిర్వహించే సమావేశం అజెండాలో ఈ అంశాలను చేర్చారు. వీటిని చూసిన కౌన్సిలర్లు ఇవేమి ఖర్చులని నివ్వెరపోయినట్లు సమాచారం. గతంలో స్పాన్సర్లను ఏర్పాటు చేసుకుని బల్దియాపై భారం లేకుండా చూసేవారు. ఖజానా అంతంత మాత్రంగానే ఉండగా.. ఆచితూచి ఖర్చు చేయాల్సింది పోయి అడ్డగోలుగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.
మహిళా దినోత్సవం ఖర్చు అక్షరాలా రూ.లక్ష
2 కే రన్‌కే రూ.70వేలు వెచ్చింపు
కోరుట్ల బల్దియాలో అడ్డగోలు లెక్కలు


