అందరూ ‘పోయారు’.. నేనెందుకు బతకాలి? | - | Sakshi
Sakshi News home page

అందరూ ‘పోయారు’.. నేనెందుకు బతకాలి?

May 23 2023 11:06 AM | Updated on May 23 2023 11:15 AM

- - Sakshi

ధర్మపురి(బుగ్గారం): ‘పుట్టుకతోనే కొడుకును కోల్పోయిన.. రోడ్డు ప్రమాదంలో కూతురు చనిపోయింది.. వారి మరణాన్ని తట్టుకోలేని నా భర్త మనస్తాపంలో మంచం పట్టిండు.. ఆ తర్వాత ఆయనా పోయిండు.. నాకు తోడుగా ఉండే నా తల్లి కూడా చనిపోయింది.. ఇక నేనెవరి కోసం బతకాలి’ అని తీవ్రంగా మదనపడిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బుగ్గారం మండల కేంద్రానికి చెందిన పన్నాటి సుమలత(38)కు జిల్లాలోని మల్యాల మండల కేంద్రానికి చెందిన గంగాధర్‌తో 2014లో వివాహమైంది.

ఈ దంపతులకు కొడుకు పుట్టగానే చనిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి కూతురు జన్మించింది. కొన్నేళ్లక్రితం ఆ బాలిక రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఇద్దరు పిల్ల లు మృతి చెందారనే మనస్తాపానికి గురైన గంగాధర్‌.. అనంతరం అనారోగ్యం బారిన పడ్డాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే అతడూ మరణించాడు. దిక్కుమొక్కులేని సుమలత.. పుట్టింటికి చేరుకుంది. కొన్నిరోజులుగా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది.

అయితే, ఆమె తల్లి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందింది. నా అనుకున్న వారంతా ఒక్కొక్కరుగా చనిపోతుండడంతో తట్టుకోలేని సుమలత .. తీవ్ర మనస్థాపనకు గురైంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. తండ్రి లక్ష్మీరాజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement