భారత్‌పై దొంగదెబ్బ తీసిన కమాండర్లకు చైనా ప్రమోషన్‌.. టాప్‌ పోస్టులతో సత్కారం!

Xi Jinping Promotes 3 India Border Command Generals To Top Posts - Sakshi

బీజింగ్‌: పొరుగు దేశం చైనా మరోసారి తన కుటిల బుద్ధిని చాటుకుంది. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత సైనికులపై దొంగదెబ్బ తీయటంలో కీలకంగా వ్యవహరించిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ పీఎల్‌ఏ కమాండ్‌ జనరల్స్‌పై ప్రశంసలు కురిపించింది. చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్‌ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. భారత సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు కమాండ్‌ జనరల్స్‌కు ప్రమోషన్‌ కల్పిస్తూ.. టాప్‌ పోస్టులు కట్టబెట్టారు. ప్రస్తుతం భారత సరిహద్దులోని వెస్టర్న్‌ థియోటర్‌ కమాండ్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  

జనరల్‌ హీ వెయిడాంగ్‌(65)ను సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌(సీఎంసీ) కొత్త వైస్‌ ఛైర్మన్‌గా నియమించారు జిన్‌పింగ్‌. సీఎంసీకు అధ్యక్షుడి హోదాలో జిన్‌పింగ్‌ నేతృత్వం వహిస్తారు. మరోవైపు.. సీఎంసీలో ఎలాంటి పదవులు చేపట్టకుండానే వైస్‌ ఛైర్మన్‌ పోస్టులోకి జనరల్‌ హీ వెయిడాంగ్‌ను నియమించటం గమనార్హం. 

► జనరల్‌ ఝాంగ్‌ యూక్సియా(72).. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు సంపాదించారు. పదవీ విరమణ వయసు దాటినప్పటికీ ఆయనను ఫస్ట్‌ ర్యాంకింగ్‌ వైస్‌ ఛైర్మన్‌గా కొనసాగించాలని నిర్ణయించారు. పీఎల్‌ఏలో జిన్‌పింగ్‌కు కుడిభుజంగా ఝాంగ్‌ను చెప్పుకుంటారు. 

► జనరల్‌ జు క్విలింగ్‌(60)ను 205 మంది సభ్యులుగా ఉన్న పార్టీ కొత్త సెంట్రల్‌ కమిటీలో నియమించారు జిన్‌పింగ్‌. మరోవైపు.. నియంత్రణ రేఖ వద్ద సంక్షోభం తలెత్తిన క్రమంలో జనరల్‌ జు క్విలింగ్‌ ఇంఛార్జిగా ఉన్నారు. దీంతో 2021 జులైలో డబ్ల్యూటీసీ హెడ్‌గా , లెఫ్టినెంట్‌ జనరల్‌ నుంచి జనరల్‌గా పదోన్నతి పొందారు.  

మరోవైపు.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ(69)కి సైతం పదవీ విరమణ వయసు దాటినప్పటికీ తనతోనే అట్టిపెట్టుకున్నారు జిన్‌పింగ్‌. పొలిట్‌ బ్యూరోలోకి వాంగ్‌ యీని తీసుకున్నారు. పార్టీ విదేశీ వ్యవహారాల సెంట్రల్‌ కమిషన్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: చరిత్రకెక్కిన జిన్‌పింగ్‌.. మావో జెడాంగ్‌ తర్వాత తొలినాయకుడిగా..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top