చరిత్రకెక్కిన జిన్‌పింగ్‌.. మావో జెడాంగ్‌ తర్వాత తొలినాయకుడిగా..

Xi Jinping Secured A Historic Third Term As China Leader - Sakshi

బీజింగ్‌: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (69) చరిత్ర సృష్టించారు. అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా (సీపీసీ) ప్రధాన కార్యదర్శిగా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్‌ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి నాయకుడు ఆయనే! బీజింగ్‌లోని ఆర్నేట్‌ గ్రేట్‌ హాల్‌లో ఆదివారం సీపీసీ 20వ సెంట్రల్‌ కమిటీ ప్లీనరీ జిన్‌పింగ్‌ అధ్యక్షతన జరిగింది.

203 మంది సెంట్రల్‌ కమిటీ సభ్యులు, 168 మంది ప్రత్యామ్నాయ సభ్యులు పాల్గొన్నారు.  జిన్‌పింగ్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఆయన ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. 24 మందితో సీపీసీ పొలిట్‌బ్యూరోకూ సెంట్రల్‌ కమిటీ ఆమోదముద్ర వేసింది. జిన్‌పింగ్‌ సహా ఏడుగురు సభ్యులతో అత్యంత శక్తిమంతమైన స్టాండింగ్‌ కమిటీనీ ఎన్నుకున్నారు. ఇందులో జిన్‌పింగ్‌ మద్దతుదారులకే స్థానం దక్కింది.

పార్టీ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ ఎన్నికయ్యాయని జిన్‌పింగ్‌ స్వయంగా ప్రకటించారు. సీపీసీ షాంఘై అధ్యక్షుడు లీ ఖియాంగ్‌.. జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచారు. చైనా ప్రీమియర్‌ (ప్రధానమంతి) లీ కెఖియాంగ్‌ వచ్చే ఏడాది మార్చిలో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో నూతన ప్రీమియర్‌గా లీ ఖియాంగ్‌ బాధ్యతలు చేపడతారన్న ప్రచారం సాగుతోంది.  

కమ్యూనిస్ట్‌ పార్టీ.. చైనా ప్రజలకు వెన్నెముక  
ప్రపంచానికి చైనా అవసరం, చైనాకు ప్రపంచం అవసరం ఉందని షీ జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారు. కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూడోసారి ఎన్నికైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచానికి దూరంగా ఒంటరిగా ఉంటూ చైనా అభివృద్ధి చెందలేదని అన్నారు. అలాగే ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే ప్రపంచానికి చైనా కావాలని చెప్పారు. తమ ఆర్థిక వ్యవస్థ నమ్మదగినది, స్వేచ్ఛాయుతమైనది అని పేర్కొన్నారు. పునాది బలంగా ఉందని వివరించారు.

దేశ విదేశీ పెట్టుబడుల కోసం తలుపులు తెరిచి ఉంచామని వెల్లడించారు. సంస్కరణల విషయంలో స్థిరంగా ముందుకు కదులుతున్నామని చెప్పారు. సౌభాగ్యవంతమైన చైనా బాహ్య ప్రపంచం కోసం ఎన్నో అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు. మార్క్సిజం వైపు మొగ్గు చూపుతుండడంతోపాటు చైనాను ఆధునిక సోషలిస్టు దేశంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని జిన్‌పింగ్‌ ఇప్పటికే ప్రకటించారు. నూతన శకంలో సోషలిజం అభివృద్ధిలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాలని కమ్యూనిస్ట్‌ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

వందేళ్ల చరిత్ర ఉన్న.. ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అయిన కమ్యూనిస్ట్‌ పార్టీ స్వయం సంస్కరణ ద్వారా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. మన పార్టీ చైనా ప్రజలకు ఒక బలమైన వెన్నుముకగా మారాలన్నారు. ఘన కీర్తి కలిగిన  చైనా అద్భుతమైన కలలతో సుదీర్ఘ ప్రయాణం సాగిస్తోందని జిన్‌పింగ్‌ వివరించారు. మార్గసూచి(రోడ్‌మ్యాప్‌) తయారు చేసుకున్నామని, శంఖం పూరించామని చెప్పారు. మన దేశానికి మెరుగైన భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. కమ్యూనిస్ట్‌ పార్టీకి పక్షపాతానికి తావులేని వాస్తవికమైన ప్రచారం కల్పించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు.  

మూడు అత్యున్నత పదవులు
అత్యంత శక్తిమంతమైన సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ (సీఎంసీ) చైర్మన్‌గా జిన్‌పింగ్‌ను కమ్యూనిస్ట్‌ పార్టీ పొలిట్‌బ్యూర్‌ మరోసారి నియమించింది. ఆయనకు మూడు అత్యున్నత పదవులు దక్కాయి. దేశాధ్యక్షుడిగా, కమ్యూనిస్ట్‌ పార్టీ అధినేతగా, సీఎంసీ చైర్మన్‌గా ఆయన వ్యవహరిస్తారు. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) జనరల్స్‌ ఝాంగ్‌ యుషియా, హీ వీడాంగ్‌ను సీఎంసీ వైస్‌ చైర్మన్లుగా నియమించారు. పలువురు సైనిక ఉన్నతాధికారులకు సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌లో సభ్యులుగా అవకాశం లభించింది. ఆదివారం సెంట్రల్‌ కమిషన్‌ ఫర్‌ డిసిప్లిన్‌ ఇన్‌స్పెక్షన్‌ (సీసీడీఐ) స్టాండింగ్‌ కమిటీ కార్యదర్శి, ఉప కార్యదర్శులు, సభ్యులను కూడా ఎన్నుకున్నారు. 24 మందితో కూడిన సీపీసీ పొలిట్‌బ్యూరోలో మహిళలకు స్థానం కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: మీడియా సాక్షిగా చైనా మాజీ అధ్యక్షుడి జింటావో గెంటివేత!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top