చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సన్నిహితుడు, ఆ దేశ సైన్యంలో రెండో అత్యున్నత స్థాయి అధికారి అయిన జనరల్ జాంగ్ యూషియాపై వేటు వేశారు. 75 ఏళ్ల జాంగ్ యూషియా చైనా అయుధ బలగాలను నియంత్రించే 'సెంట్రల్ మిలిటరీ కమిషన్' (CMC) కి వైస్ ఛైర్మన్‌గా ఉన్నాడు.
జాంగ్ అవినీతి, క్రమశిక్షణ ఉల్లంఘన పాల్పడ్డారని ఆరోపిస్తూ జిన్‌పింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయను పదవి నుంచి తొలగించి, విచారణకు ఆదేశించారు. ఆయనతో పాటు సీఎంసీ జాయింట్ స్టాఫ్ డిపార్ట్‌మెంట్ చీఫ్ జనరల్ లియు జెన్లీపై కూడా మొదలైనట్లు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. జాంగ్ యూషియా ప్రస్తుతం తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
అణు రహస్యాల లీక్..?
చైనా అణ్వాయుధ కార్యక్రమానికి సంబంధించిన సాంకేతిక డేటాను (Nuclear Data) జాంగ్ అమెరికాకు లీక్ చేశారని వాల్ స్ట్రీట్ జర్నల్ తమ కథనంలో పేర్కొంది. రక్షణ మంత్రిగా ఒక అధికారిని నియమించేందుకు భారీగా లంచం తీసుకున్నారన్న ఆరోపణ కూడా జాంగ్‌పై ఉంది.
అంతేకాకుండా జిన్‌పింగ్‌ను పదవి నుంచి దించేందుకు కూడా జాంగ్ యూషియా కుట్ర పన్నారని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ కారాణాలతో అతడిని పదవి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. అయితే 2027 నాటికి తైవాన్‌ను ఆక్రమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న జిన్‌పింగ్‌కు ఇప్పుడు ఇద్దరు సీనియర్ జనరల్స్‌ను కోల్పోవడం గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి.
కాగా సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మెన్‌గా జిన్‌పింగ్ ఉన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ప్రధాన కార్యదర్శే ఈ సీఎంసీ చైర్మెన్. జిన్‌పింగ్ కన్నా ఒక ర్యాంకు తక్కువగా సీఎంసీ ఉపాధ్యక్షుడి హోదాలో జాంగ్ ఉన్నారు. ఇప్పుడు అంతటి పవర్‌ఫుల్ హోదాలో ఉన్న జాంగ్‌పై వేటు వేయడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


