
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ క్షురకురాలిగా 108 ఏళ్ల షిట్సూయ్ హకోయ్‌షీ రికార్డు
టోక్యో: శతాధిక వృద్ధులు సాధారణంగా త మ పని తాము చేసుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. ఒంట్లో పటుత్వం తగ్గి పోయి లేచి నడవడానికి, గాజు వస్తువులను పగలకుండా జాగ్రత్తగా పట్టుకెళ్లడానికి ఎంతో కష్టపడుతుంటారు. ఇక కత్తెర పట్టుకుని జుట్టు కత్తిరించమంటే వాళ్లు చేసే కటింగ్ దెబ్బకు హెర్‌స్టయిల్ (Hair Style) ఎటు పోతుందో ఎవరూ చెప్పలేరు. అలాంటిది ఏకంగా 108 ఏళ్ల వయసులో కూడా ఓ బామ్మ ఎంచక్కా కత్తెరను ఒడుపుగా చురకత్తిలాగా ఝుళిపిస్తూ చక్కటి తలకట్టు తీర్చిదిద్దుతోంది. ఆమె పేరే షిట్సూయ్ హకోయ్‌షీ.
9 దశాబ్దాలుగా హెయిర్‌స్టయిల్ వృత్తిలో..
ఈశాన్య టోక్యోలోని టొచిగి జిల్లాలోని నకగవా పట్టణంలోని బామ్మ షిట్సూయ్‌కు బార్బర్ దుకాణం(Barber Shop) ఉంది. మొదటి ప్రపంచయుద్దకాలంలో అంటే 1916 నవంబర్ పదో తేదీన రైతు కుటుంబంలో ఈమె జన్మించారు. హెయిర్ కటింగ్ (Hair Cut) అంటే ఈమెకు చాలా ఇష్టం. ‘‘టోక్యోలో ఉద్యోగం ఉంది. కావాలంటే అక్కడికెళ్లి జాయిన్ అవ్వు’’అని స్నేహితురాలి తల్లి ఇచ్చిన సలహాను షిట్సూయ్ పాటించారు. టీనేజీలో ఉండగానే 14 ఏళ్ల వయసులోనే ఒంటరిగా టోక్యో సిటీకి వెళ్లి బార్బర్ అప్రైంటిస్‌గా చేరారు. 20 ఏళ్ల వయసులో బార్బర్‌గా లైసెన్స్ సంపాదించారు. 24 ఏళ్ల వయసులో జెరోను పెళ్లాడారు. తర్వాత భర్తతో కలిసి బార్బర్ షాప్ ప్రారంభించారు.
వీళ్లకు ఇద్దరు సంతానం. 1937లో జపాన్‌పై చైనా జరిపిన యుద్ధంలో ఈమె భర్త ప్రాణాలు కోల్పోయారు. తర్వాత ఎనిమిదేళ్లకు అంటే 1945 మార్చి పదో తేదీన టోక్యోపై అమెరికా జరిపిన బాంబు దాడిలో ఈమె బార్బర్ దుకాణం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో పిల్లలు, కట్టుబట్టలతో ఈమె నగరాన్ని వీడి టొచిగి జిల్లాలో ని వేరే ప్రాంతానికి తరలిపోయారు. తర్వాత ఎనిమిదేళ్లకు 1953లో సొంతూరు నకగవాకు చేరి అక్కడ తన పేరు మీద ‘రిహాట్సు హకోయ్‌షీ అని బార్బర్ దుకాణం ప్రారంభించారు. అప్పట్నుంచీ అదే దుకాణంలో దశాబ్దాలుగా కటింగ్ వృత్తిలోనే కొనసాగుతున్నారు. రిహాట్సు అంటే జపనీస్ భాషలో బార్బర్ అని అర్థం.
కస్టమర్లే నా దేవుళ్లు
108 ఏళ్ల వయసులోనూ బార్బర్‌గా కొనసాగుతున్న ఈమెకు గత బుధవారం గిన్నిస్ ప్రపంచ రికార్డ్ (Guinness World Record) నిర్వాహకులు వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్‌ను అందజేశారు. ఇన్నాళ్లూ అమెరికాలో 107 ఏళ్ల వయసులోనూ బార్బర్‌గా కొనసాగిన ఆంటోనీ మాన్సినెల్లీ అనే తాతకు గిన్నిస్ ప్రపంచ రికార్డ్ సర్టిఫికేట్ ఉండేది. ఆయన 2018లో మరణించడంతో అప్పట్నుంచీ ఎవరికీ ఆ సర్టిఫికేట్ ఇవ్వలేదు. బామ్మ విషయం తెల్సి తాజాగా ఈమెకు ఆ రికార్డ్ కట్టబెట్టారు.
చదవండి: గుడ్లు తేలేస్తున్న అమెరికా
‘‘108 ఏళ్ల వయసు బామ్మ వణుకుతూ కటింగ్ ఎలా చేస్తుందో అన్న భయం, అనుమానం లేకుండా నామీద నమ్మకంతో వస్తున్న కస్టమర్లే నాకు దేవుళ్లు. వాళ్ల సంతోషమే నాకు అమితానందాన్ని ఇస్తుంది. వయసులో సెంచరీ దాటినా నేను నా వృత్తిని వదులుకోను. కత్తెరలను పక్కనబెట్టే ప్రసక్తే లేదు. ఓపిక ఉన్నంతకాలం కటింగ్ చేస్తా. ఈ ఏడాది 109వ పుట్టినరోజు జరుపుకోబోతున్నా. ఓపిక తగ్గితే 110 ఏళ్ల వయసులో కటింగ్‌ను ఆపేస్తా’’అని బామ్మ నవ్వుతూ చెప్పారు.