Ruby Roman Grapes: ఐఫోన్‌, బంగారం కంటే షాకింగ్‌ ధర!

 World Most Expensive Grapes Ruby Roman  Rs 35,000 Per Piece In Japan - Sakshi

అరుదైన జపనీస్ ద్రాక్ష పండ్లు

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్ష ‘రూబీ రోమన్‌’

కిలో ద్రాక్ష ధర, తులం బంగారం కంటే అధికం

ప్రతి ద్రాక్ష బరువు 20 గ్రాములు 

ఒక్కో ద్రాక్ష ధర సుమారు రూ .35వేలు

సాక్షి, న్యూఢిల్లీ: మొన్న ఖరీదైన మామిడి పళ్లు గురించి విన్నాం.ఇపుడిక ప్రపంచంలోనే అతి ఖరీదైన, అరుదైన ద్రాక్ష పండ్లు గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో అనేక రకాల ద్రాక్షలు కనిపిస్తాయి. కానీ చక్కటి రంగు,రుచితో పింగ్‌పాంగ్‌ బంతి సైజులో ఉండే  ‘రూబీ రోమన్‌ ద్రాక్ష’  ప్రత్యేకతే వేరు. ఈ రకానికి చెందిన ప్రతి ద్రాక్ష బరువు 20 గ్రాముల కంటే ఎక్కువే. రుచిలో కూడా  రాయల్‌గా ఉంటాయి. అయితే వీటిని కొనాలంటే మాత్రం జేబుకు భారీ చిల్లు తప్పదు.  ఐఫోన్‌, తులం బంగారం కంటే కంటే ఎక్కువ పెట్టాల్సిందే. ఇంతకీ ఏంటబ్బా  అంత  స్పెషాలీటీ!  

రూబీ రోమన్ ద్రాక్ష అని పిలిచే ఈ ద్రాక్ష తక్కువ పుల్లగా, ఎక్కువ తీపిగా, జ్యూసీగా జ్యూసీగా ఉంటుంది. అందుకే అంత పాపులర్‌.  ఈ ద్రాక్ష కిలో ధర 11 వేల డాలర్లు. అంటే అక్షరాలా రూ.7.5 లక్షలు. షాకవ్వకండి..ఇది నిజం. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్షగా  ఖ్యాతి దక్కించుకుంది. రూబీ రోమన్ ద్రాక్ష జపాన్‌లో 2019లో రికార్డు ధరకు అమ్ముడుపోయింది. 

ఫైల్‌ ఫోటో

జపాన్‌లోని ఇషికావా దీవిలో పరిమిత సంఖ్యలో రుబీ రోమన్ ద్రాక్ష పండ్లను పండిస్తారు.  2008 నుంచి పండించడం మొదలుపెట్టారు. జపనీస్ లగ్జరీ ఫ్రూట్ మార్కెట్లో వీటికి చాలా డిమాండ్. ఈ ద్రాక్షనుమొదట మార్కెట్లో విక్రయించరు. వేలంలో అధిక ధర చెల్లించిన వారికి మాత్రమే సొంతం. అందుకే దీన్ని కొనుగోలు చేసేందుకు  ఔత్సాహికులు  క్యూ కడతారు.

ప్రతీ ఏడాది రికార్డు ధరను సొంతం చేసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 2019లో  ఈ ద్రాక్షను కనజవాలో వేలానికి పెట్టగా, జపాన్‌కు చెందిన హయాకురాకుసో అనే సంస్థ ఈ ద్రాక్ష గుత్తిని వేలంలో గెలుచుకుంది.  మొత్తం 24 ద్రాక్ష పండ్ల గుత్తిని  12 లక్షల యెన్లకు సొంతం చేసుకుంది. అంటే ఒక ద్రాక్ష ధర సుమారు రూ.35 వేలన్న మాట. మార్కెట్లో ప్రవేశపెట్టిన గత 11 ఏళ్లలో ఎన్నడూ ఇంత ధర పలకలేదని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ అసోసియేషన్‌ వెల్లడించింది. కాగా సాధారణ రోజుల్లో ఈ ద్రాక్ష గుత్తి ధర 460 డాలర్లు (రూ.31,537) వరకు ఉంటుందని స్థానిక రైతులు చెప్పారు. అలాగే వీటిని ఎక్కువగా ఇతరులకు బహుమతిగా ఇచ్చేందుకు కొనుగోలు చేస్తారనీ,  వీఐపీ గెస్టులకు గిఫ్ట్‌గా ఇచ్చేందుకు కొన్ని విలాసవంతమైన హోటల్స్‌ కొనుగోలు చేస్తుంటాయని తెలిపారు.

కాగా మధ్యప్రదేశ్‌లోని ఒక జంట జపనీస్ మియాజాకి మామిడి పండ్లను పండించి ఇటీవల వార్తల్లోకె క్కిన సంగతి తెలిసిందే.కిలోకు రూ.2.70 లక్షలతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిగా రికార్డు  కొట్టేసిన వీటి రక్షణకు నలుగురు భద్రతా సిబ్బందిని, ఆరుకుక్కలను ఏర్పాటు చేసుకోవడం విశేషంగా నిలిచింది.

Election 2024

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top