
వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని నిర్బంధ కేంద్రాల్లో(డిటెన్షన్ సెంటర్లు)మహిళకు ఘోర అవమానకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. మయామి పశ్చిమ ప్రాంతంలోని క్రోమ్ నార్త్ సర్వీస్ ప్రాసెసింగ్ సెంటర్‌లో మహిళా ఖైదీలు.. పురుష ఖైదీల ఎదుట టాయిలెట్లను ఉపయోగించవలసిన దుస్థితి ఏర్పడింది.
‘యూ ఫీల్ లైక్ యువర్ లైఫ్ ఈజ్ ఓవర్’ పేరుతో వెలువడిన ఒక నివేదికలో అమెరికాలోని ఫ్లోరిడాలో గల మూడు ఇమ్మిగ్రేషన్ సెంటర్లలో తగిన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేని వలసదారులు ఘోర అవమానకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. 2025 మొదటి నుంచి ఈ విధమైన దుస్థితి మరింతగా పెరిగిందని నివేదికలో వెల్లడించారు. సంకెళ్ళు వేయడం, అరకొర ఆహారం అందించడం, పరిశుభ్రంగా లేని ప్రాంతంలో ఉంచడం, వైద్య సంరక్షణలో ఆలస్యం చేయడం మొదలైనవి వీటిలో ఉన్నాయని తెలియజేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఖైదీ మరిణించారని కూడా దానిలో పేర్కొన్నారు.
అక్రమ వలసదారులను సంకెళ్లతో బంధించి, వారి చేతులు వెనుకకు కట్టి, కుక్కల మాదిరిగా స్టైరోఫోమ్ ప్లేట్లలోని ఆహారాన్ని మోకరిల్లి తినాలంటూ అధికారులు బలవంతం చేశారని ఆ నివేదిక పేర్కొంది. పదుల సంఖ్యలో పురుషులను గంటల తరబడి సెల్‌లలో బంధించారని, సాయంత్రం 7 గంటల వరకు ఆహారం పెట్టలేదని నివేదిక తెలిపింది. తాము జంతువుల మాదిరిగా ఆహారం తినవలసి వచ్చిందని పెడ్రో అనే ఖైదీ తెలిపాడు. ఈ ఘటన మయామి ఇమ్మిగ్రేషన్ జైలులో చోటుచేసుకుంది. పశ్చిమ మయామిలోని క్రోమ్ నార్త్ సర్వీస్ ప్రాసెసింగ్ సెంటర్‌లో పురుష ఖైదీల ముందు మహిళా ఖైదీలు టాయిలెట్‌లను ఉపయోగించవలసిన దుర్భర పరిస్థితిని అధికారులు కల్పించారని నివేదిక పేర్కొంది. పోంపానో బీచ్‌లోని బ్రోవార్డ్ పరివర్తన కేంద్రంలో 44 ఏళ్ల హైతీ మహిళ మేరీ ఏంజ్ బ్లేజ్ ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోనే మృతిచెందింది. ఎవర్‌గ్లేడ్స్‌లోని అలిగేటర్ అల్కాట్రాజ్ జైలులో సౌకర్యాలు లేనప్పటికీ సరైన పత్రాలు లేని ఐదువేల మంది వలసదారులను ఉంచి, ఇబ్బందుకు గురిచేసినట్లు నివేదికలో పేర్కొన్నారు.