సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అల్ అందలస్ మెట్రో స్టేషన్‌లో మెట్రో స్టేషన్‌లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణికుల రాకపోకలతో నిత్యం బిజీగా ఉండే మెట్రో స్టేషన్.. ఒక కొత్త ప్రాణానికి పురుడు పోసిన వేదికగా మారింది. అల్ అందలస్ మెట్రో స్టేషన్‌లో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రియాద్ మెట్రో చరిత్రలో స్టేషన్ ఫరిధిలో ఒక శిశువు జన్మించడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని రియాద్ మెట్రో అధికారికంగా ప్రకటించింది.
ఏం జరిగిందంటే?
ఓ గర్భిణీ మహిళ స్టేషన్‌లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. విషయం గమనించిన మెట్రో ఆపరేషన్స్ టీమ్ తక్షణం స్పందించింది. వెంటనే అంబులెన్స్‌కు సమచారమిచ్చారు. అయితే అంబులెన్స్ వచ్చేందుకు సమయం పట్టనుండడంతో స్టేషన్‌లోని మహిళా సిబ్బంది ఆమెకు డెలివరీ చేశారు. దీంతో సదరు మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
అదరిపోయే గిఫ్ట్
అయితే ఈ సందర్భంగా రియాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ బిడ్డ తల్లిదండ్రులకు ఏడాది పాటు చెల్లుబాటు అయ్యే రెండు ఫస్ట్ క్లాస్ 'దర్బ్' కార్డులను మెట్రో గిఫ్ట్‌గా ఇచ్చింది. దీంతో వారు సంవత్సరం పాటు మెట్రోలో ఉచితంగా ప్రయాణించవచ్చు. అదేవిధంగా అత్యవసర సమయంలో స్పందించి ప్రసవం చేసిన సిబ్బందిని అధికారులు ప్రశంసించారు.


