డొనాల్డ్ ట్రంప్.. కాసేపు యుద్ధం అంటారు..అంతలోనే శాంతి అంటారు. కాసేపు అది మాకు కావాలంటారు.. మరికాసేపటికి మాకు సహకరించకపోతే వారిని గుర్తు పెట్టుకుంటామంటారు ఎలా చెప్పుకున్నా ట్రంప్ వైఖరి గంటకో అవతారం అన్న మాదిరిగా ఉంది. ఈ క్రమంలోనే ట్రంప్ కొత్త కూటమిని ఏర్పాటు చేశారు. వరల్డ్ ఎకానిమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాలు జరుగుతున్న దావోస్ నగర వేదికగా బోర్డ్ ఆఫ్ పీస్(శాంతి మండలి)ని ఏర్పాటు చేశారు.
దీనికి 35 దేశాల మద్దతు తెలుపగా, భారత్ తటస్థ వైఖరిని అవలంభించింది. దీనికి భారత్ దూరంగా ఉండటానికి కారణాలను ఒక్కసారి విశ్లేషిస్తే.. ప్రధాన కారణం మాత్రం ఈ మండలి యొక్క న్యాయబద్ధతపై సందేహాలు ఉంటమేనని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దాంతో పాటు భారతదేశం యొక్క స్వతంత్ర విదేశాంగ ధోరణి మరొక కారణం.
ట్రంప్ స్వ ప్రయోజనాలతో ఏర్పడిన కూటమా?
ట్రంప్ ఏర్పాటు చేసిన శాంతి మండలిపై అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డ్ ఆఫ్ పీస్ అంటూ కొత్త కొలిమిని ఏర్పాటు చేసినా. అది ట్రంప్ స్వప్రయోజనాలతో ముడిపడి ఉందనే విషయాన్ని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆకస్మికంగా ట్రంప్ శాంతి కూటమిని ఏర్పాటు చేయడానికి ఆయన సొంత లాభం లేకపోతే ఎందుకు ఏర్పాటు చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా UN General Assembly లాంటి సర్వసభ్యత్వం లేకపోవడం వల్ల ఇది అంతర్జాతీయంగా సమగ్రతను కోల్పోయందనేది విశ్లేషకుల మాట.
మరొకవైపు మండలిలో పాలస్తీనా వర్గాల ప్రత్యక్ష భాగస్వామ్యం స్పష్టంగా లేకపోవడం భారతదేశానికి ఆందోళన కలిగించింది.భారతదేశం ఎప్పటినుంచో రెండు దేశాల సమస్య పరిష్కారానికి మద్దతు ఇస్తూ వస్తోంది.
ఇది భారీ ఆర్థిక బాధ్యత..
అదే సమయంలో ఈ కూటమి భారీ ఆర్థిక బాధ్యతతో కూడుకున్నది. ఇందులో ఉన్న సభ్య దేశాలు $1 బిలియన్ (సుమారు ₹8,300 కోట్ల రూపాయలు) చెల్లించాల్సిన నిబంధన ఉంది. అంటే భారీ ఆర్థిక భారాన్ని సభ్య దేశాలు మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది భారతదేశానికి భారీ ఆర్థిక బాధ్యతగా చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.
స్వతంత్ర, సమతుల్య విదేశాంగ విధానానికే భారత్ పెద్దపీట
భారత్ ఎప్పుడూ స్వతంత్ర, సమతుల్య విదేశాంగ విధానాన్నే అనుసరిస్తుంది. అమెరికా ఆధ్వర్యంలో ఏర్పడిన మండలిలో చేరడం వల్ల అంతర్జాతీయంగా పక్షపాత భావన కలగవచ్చని భారత్ భావించినట్లు కనబడుతోంది. భారత్ ఇప్పటికే యూఎన్ ఏజెన్సీల ద్వారా గాజాకు సహాయం అందిస్తోంది. ట్రంప్ మండలిలో చేరకుండా కూడా పునర్నిర్మాణం, సహాయం అందించగలదని భారత్ నమ్ముతోంది.
ఇది కూడా గుర్తు పెట్టుకుంటారా?
తమకు సహకరించిన, సహకరించిన దేశాలను గుర్తు పెట్టుకుంటామని అదే దావోస్ వేదికగా ట్రంప్ చెప్పుకొచ్చారు. తాము చేసేది మహాయజ్ఞం అన్న చందంగా బిల్డప్ ఇచ్చిన ట్రంప్.. సహకరించకపోతే మాత్రం తప్పుకుండా మదిలో పెట్టుకుంటామన్నారు. ఇప్పుడు ట్రంప్ ఏర్పాటు చేసిన శాంతి కూటమికి భారత్, రష్యాలతో పాటు చైనా కూడా తటస్థ వైఖరిని అవలంభించింది. ఇప్పుడు ఈ కూటమికి అంత సీన్ లేదనే ఈ మూడు దేశాలు భావించే కాస్త దూరంగా ఉన్నాయి. అలాగని కూటమిలో చేరడం లేదని కానీ, భవిష్యత్‌లో చేరే ఉద్దేశం కూడా లేదని కానీ చెప్పలేదు. మరి ఈ మూడు అగ్రదేశాలను ఒప్పించి, మెప్పించే పని ట్రంప్ చేస్తారా? అనేది మరొక ప్రశ్న.
ఇప్పటికే భారత్‌పై పూర్వపు ప్రేమను ట్రంప్ కురిపిస్తున్నారు. భారత్ తమక మిత్రదేశమని, త్వరలో అతి పెద్ద ట్రేడ్ డీల్ ఉంటుందని కూడా చెప్పేశారు. ఇక రష్యా విషయానికొస్తే.. ఆ దేశం కూడా ట్రంప్ వైఖరిని చాలా ఆచితూచి అడుగులు వేస్తోంది. గ్రీన్‌లాండ్ అంశానికి సంబంధించి కూడా రష్యా సానుకూలంగానే స్పందించింది. అది ట్రంప్‌కు, నాటో దేశాలకు సంబంధించిన విషయమని, ఇక్కడ రష్యా జోక్యం ఉండదని చాలా కామ్ అండ్ నీట్‌గా పుతిన్ తేల్చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూల్‌గా వెళ్లిపోతేనే బెటర్ అనే భావనలో పుతిన్ ఉన్నారు. అందుకు గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ వైఖరిని ఖండించలేదు. ఇక చైనా ఎప్పుడూ అమెరికాకు పోటీనే. మరి ఇప్పుడు ఆ దేశం కూడా ట్రంప్ శాంతి కూటమికి దూరంగానే ఉంది.
కానీ భవిష్యత్‌లో జరగబోయే పరిణామాల దృష్యా చైనా ఒక నిర్ణయానికి రావొచ్చు. లేకపోతే శాశ్వతంగా ఈ కూటమికి దూరంగా కూడా ఉండొచ్చు. అమెరికా మాదిరిగానే చైనా కూడా స్వప్రయోజనాలకే పెద్ద పీట వేస్తుందనేది కాదనలేని సత్యం. ఇక్కడ చైనాకు ఏమైనా ప్రయోజనాలు ఉంటేనే అందులో చేరుతుంది. అందుచేత అమెరికా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కూటమిని చైనా నిశితంగా గమనించిన తర్వాతే ఒక్క నిర్ణయానికి రావొచ్చు.
ఇప్పటికే ఫ్రాన్స్, నార్వే, స్లోవేనియా, స్వీడన్, బ్రిటన్‌లుఘా కూటమిలో చేరమని తేల్చేయగా, ఖతార్, సౌదీ అరేబియా, అర్జెంటీనా, మంగోలియా, పాకిస్తాన్, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, ఇండోనేసియా, జోర్డాన్, అల్బేనియా, అర్మేని యా, అజర్‌బైజాన్, బహ్రెయిన్, బెలారస్, బల్గేరియా, ఈజిప్ట్, హంగేరీ, కజకిస్తాన్, కొసోవో, మొరాకోలు కూటమిలో చేరాయి.
తటస్థంగా ఉన్న దేశాలు ఇవి..
రష్యా, భారత్, సింగపూర్, థాయ్‌లాండ్, ఉక్రెయిన్, ఇటలీ, జర్మనీ, కాంబోడియా, చైనా, క్రొయేషియా, సైప్రస్, గ్రీస్, పరాగ్వే, యూరోపియన్ యూనియన్ కార్యనిర్వాహక విభాగం


