
లిబరేషన్ డే సుంకాలకు లైన్ క్లియర్ అయినప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కోపం చల్లారలేదు. తన ప్రభుత్వం విధించిన సుంకాలు అమలుకాకుండా మాన్‌హట్టన్ ట్రేడ్ కోర్టు నిలుపుదల చేయడంపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తీర్పు రాజకీయ పక్షపాతంతో కూడుకున్నదని, అధ్యక్షుడి అధికారాలను న్యాయమూర్తులు అణగదొక్కారని మండిపడ్డారు.
‘‘అంతర్జాతీయ వాణిజ్యపు న్యాయస్థానం అమెరికాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అదృష్టవశాత్తూ.. మాన్‌హట్టన్ వాణిజ్యపు న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని 11 మంది న్యాయమూర్తులతో కూడిన ఫెడరల్ సర్క్యూట్ కోర్టు ఆదేశించింది. అసలు ఆ ముగ్గురు న్యాయమూర్తులు(మాన్‌హట్టన్ బెంచ్) ఎక్కడి నుంచి వచ్చారు?. అమెరికాకు తీవ్ర నష్టం చేకూర్చే పనిని చేయడం వాళ్లకు ఎలా సాధ్యమైంది?. ఇదంతా ట్రంప్‌పై ద్వేషంతో చేసిందే. ఇది తప్పుడు చర్య. రాజకీయ పక్షపాతంతో కూడుకున్నదే’’ అని ఆయన ఓ పోస్ట్ చేశారు.
ఏప్రిల్ 2న లిబరేషన్ డే పేరుతో ట్రంప్ పలు దేశాలపై సుంకాలను(Liberation Day tariffs) విధించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ తన అధికార పరిధిని అతిక్రమించారని, దేశ వాణిజ్య విధానం తన వెర్రి ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలని కోరుకుంటున్నారంటూ అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
దీనిపై విచారణ జరిపిన మాన్‌హట్టన్ వాణిజ్య న్యాయస్థానం(Manhattan Trade Court).. సుంకాల విధింపునకు కత్తెర వేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని తేల్చిచెప్పింది. అయితే.. సుంకాలకు సంబంధించి ప్రస్తుతం పలు దేశాలతో చర్చలు జరుగుతున్నాయనే విషయాన్ని ట్రంప్ సర్కారు కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ ట్రేడ్ డీల్స్‌ను ఖరారు చేసుకునేందుకు జులై 7 వరకు గడువు ఉందని, అప్పటివరకు దీన్ని చాలా సున్నితమైన అంశంగా పరిగణించాలని కోర్టును కోరింది. కానీ,
ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసిన అన్ని వాదనలను కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో.. ‘‘టారిఫ్ అధికారం వల్లనే ఇటీవల భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ సాధించగలిగారు’’ అని న్యాయధికారులు కోర్టుకు తెలిపారు. కానీ, ఈ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాలు అమలుకాకుండా నిలుపుదల చేసింది. అయితే..
.. మాన్‌హట్టన్ కోర్టు ఆదేశాలపై ట్రంప్ సర్కారు అప్పీల్ దాఖలు చేసింది. గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. దీనిపై జూన్ 5లోగా ఫిర్యాదుదారులు, జూన్ 9లోగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు స్పందించాలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ట్రంప్ చెప్పేదొకటి.. చేసేదొకటి!