రష్యా టీకాపై మిశ్రమ స్పందన!

Vladimir Putin's vaccine power evokes mixed response - Sakshi

మాస్కో/మయామీ: కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు టీకా (స్పుత్నిక్‌) సిద్దమైందని రష్యా చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ స్పందన కలిగించింది. మూడో దశ మానవ ప్రయోగాలు పూర్తి కాకుండానే టీకా (స్పుత్నికను విడుదల చేయడం ఏమాత్రం సరికాదని, మానవ ప్రయోగాల సమాచా రాన్ని డబ్ల్యూహెచ్‌ఓకు సమర్పించలేదని పలువురు విమర్శలకు దిగగా.. రష్యా మాత్రం తన దారిన తాను ముందుకెళుతోంది.

ప్రభుత్వ నియంత్రణ సంస్థల వద్ద టీకా నమోదు ప్రక్రియను పూర్తి చేసి, ఒకట్రెండు వారాల్లోనే ఉత్పత్తి ప్రారంభిస్తామని రష్యా ప్రకటించింది. వ్యాక్సిన్‌కు రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా స్పందిస్తోందని, తన కుమార్తెకు తొలి దఫా టీకా ఇచ్చామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్వయంగా మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. టీకాను లాటిన్‌ అమెరికా దేశాలతోపాటు ఆసియా దేశాలకూ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. టీకా వేసుకున్న వారిని పరిశీలించేందుకు రష్యా  స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ తయారు చేస్తున్నట్లు సమాచారం.  

ప్రయోగ సమాచారం ఏదీ?
స్పుత్నిక్‌ టీకాకు చాలా వేగంగా అనుమతులి వ్వడం నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. సామర్థ్యం, భద్రత వంటి అంశాల్లో స్పుత్నిక్‌ ఇప్పటికీ ప్రామాణిక పద్ధతులను పాటించ లేదని కాబట్టి ఈ టీకాను వాడటం సరికాదని వీరు అంటున్నారు. తొలి రెండు దశల ప్రయోగాల్లో భాగంగా దాదాపు వంద మందిపై టీకా పరీక్షించారని, మూడో దశలో వేల మందిపై జరపాల్సిన ప్రయోగాలు చేపట్టనే లేదన్నది వీరి అభ్యంతరం.  

‘అదృష్టవంతులైతే పనిచేస్తుందేమో’
హైదరాబాద్‌: రష్యా అభివృద్ధి చేసిన టీకాను ఎక్కువ మందిపై పరీక్షించకపోతే దాని సామర్థ్యాన్ని అంచనా వేయడం కష్టమని హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యురల్‌ బయాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. ప్రజలు అదృష్టవంతులైతే టీకా పనిచేస్తుందేమో అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘వాళ్లు తగినన్ని ప్రయోగాలు చేయలేదు. ఎక్కువ మందిలో టీకా ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు మూడో దశ మానవ ప్రయోగాలు అవసరం’అని చెప్పారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top