రష్యాను ప్రపంచానికి దూరం చేయటం అసాధ్యం: పుతిన్‌

Vladimir Putin Said That Impossible to Cut Russia From the World - Sakshi

మాస్కో:  ఉక్రెయిన్‌పై సైనిక చర్యతో విరుచుకుపడుతున్న రష్యాను నిలివరించేందుకు పశ్చిమ దేశాలతో పాటు చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. అయినా.. వెనక్కి తగ్గేదేలే అంటూ దాడులు కొనసాగిస్తున్నారు అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌. ఈ నేపథ్యంలో మరిన్ని ఆంక్షలు విధించి.. ప్రపంచ దేశాలకు దూరం చేయాలనే వాదనలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రపంచ దేశాల నుంచి రష్యాను వేరు చేసి ఏకాకిని చేయటం అసాధ్యమని పేర్కొన్నారు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌. పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు దశాబ్దాలుగా మాస్కో సాధించిన ప్రగతిని నిలువరించలేవని స్పష్టం చేశారు. 

ప్రభుత్వ ఉ‍న్నతాధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు పుతిన్‌. ‘ప్రస్తుత పరిస్థితి మా దేశానికి ప్రధాన సవాలు అని తెలుసు. మా శత్రు దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్నప్పటికీ.. మేము ప్రజల నమ్మకాన్ని, దశాబ్దాల పురోగతిని కోల్పోము. దేశంలోని సొంత సాంకేతికతను ఉపయోగించుకుంటూ కొత్త పరిష్కారం కోసం దేశం చూస్తోంది. మా దేశానికి పెద్ద సవాలు ఇది. కానీ, మేము వెనక్కి తగ్గేదే లేదు. ప్రపంచానికి దూరంగా ఏకాకిగా మారటమనేది అసాధ్యమని విస్పష్టం.’ అని పేర్కొన్నారు. 

రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ప్రయత్నాలను తిప్పికొట్టారు పుతిన్‌. అందుకోసం దేశీయ తయారీని ప్రోత్సహించటం, అంతర్గతంగా ఎండ్ టూ ఎండ్‌ టెక్నాలజీని అభివృద్ధి చేయటం, విదేశీ ఎగుమతులను నిలిపివేయటం వంటి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరోవైపు.. రష్యా సాంకేతిక విభాగాలను ప్రోత్సహించటమే తమ తొలి ప్రాధాన్యమని తెలిపారు ఆ దేశ ఆర్థిక మంత్రి అంటోన్‌ సిలునోవ్‌. ప్రభుత్వం ఒక రూబల్‌ పెట్టుబడితో వస్తే.. ప్రైవేటు సంస్థలు మూడు రూబల్‌ పెట్టాలని కోరారు.

ఇదీ చదవండి: ఉక్రెయిన్‌ని మట్టికరిపించేలా...తదుపరి దశ దాడులకు దిగుతున్న రష్యా!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top