Virus spillover: తర్వాతి వైరస్‌ మహమ్మారి రాక...హిమానీ నదాల నుంచే!

Virus spillover: Next viral pandemic could come from melting glaciers - Sakshi

లండన్‌: వాతావరణ మార్పులు ప్రపంచమంతటా కనీవినీ ఎరగని ఉత్పాతాలకు దారి తీస్తున్న వైనం కళ్లముందే కన్పిస్తోంది. కొన్ని దేశాల్లో కరువు, మరికొన్ని దేశాల్లో ఎన్నడూ చూడనంతటి వరద విల యం సృష్టిస్తున్నాయి. ఇవి చాలవన్నట్టు, వాతావరణ మార్పుల దుష్ప్రభావం మరో తీవ్ర ప్రమాదానికి కూడా దారితీసే ఆస్కారం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి సగటు ఉష్ణోగ్రత స్థాయి శరవేగంగా పెరుగుతుండటంతో హిమాలయాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమానీ నదాలన్నీ అంతే వేగంగా కరిగిపోతుండటం తెలిసిందే.

‘‘ఈ హిమానీ నదాల గర్భంలో బహుశా మనకిప్పటివరకూ తెలియని వైరస్‌లెన్నో దాగున్నాయి. హిమానీ నదాల కరుగుదల వేగం ఇలాగే కొనసాగితే భూమిపై విరుచుకుపడబోయే తర్వాతి వైరస్‌ మహమ్మారి వచ్చేది గబ్బిలాల నుంచో, పక్షుల నుంచో కాక.. నదాల గర్భం నుంచే అది పుట్టుకురావచ్చు’’ అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలా వచ్చే వైరస్‌లు వన్యప్రాణులకు, అక్కణ్నుంచి  మనుషుల్లో ప్రబలుతాయని అంచనా వేస్తున్నారు.

దీన్ని వైరస్‌ స్పిలోవర్‌గా పిలుస్తున్నారు. ఇందుకోసం ఆర్కిటిక్‌లోని మంచినీటి సరస్సు లేక్‌ హాజెన్‌ తాలూకు మన్ను, మడ్డి తదితరాలను శాస్త్రవేత్తల బృందం విశ్లేషించింది. అవశేషాల తాలూకు ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏ నమూనాలను  వైరస్‌లతో జతపరిచి చూశారు. హిమానీ నదీ గర్భాలు బయటికి తేలే పక్షంలో, అక్కడి  కళేబరాల నుంచి తెలియని తరహా వైరస్‌లు వచ్చి పడే ప్రమాదముందని తేల్చారు. అధ్యయన ఫలితాలను రాయల్‌ సొసైటీ జర్నల్లో ప్రచురించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top