జిన్‌పింగ్‌కు టెన్షన్‌.. చైనా అధికారులకు అమెరికా ట్రాప్‌? | USA CIA Releases Chinese Officials to Spy Videos Luring | Sakshi
Sakshi News home page

జిన్‌పింగ్‌కు టెన్షన్‌.. చైనా అధికారులకు అమెరికా ట్రాప్‌?

May 4 2025 8:15 AM | Updated on May 4 2025 10:56 AM

USA CIA Releases Chinese Officials to Spy Videos Luring

వాషింగ్టన్‌: చైనా అధికారులను బుట్టలో వేసుకునేందుకు అమెరికా గూఢచార సంస్థ సీఐఏ ఎప్పటికప్పుడు కొత్త దారులు వెదుకుతోంది. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పాలనలో తమ భద్రత గురించి ఆందోళన చెందే చైనా అధికారులు తమతో కలిసి పనిచేయాలంటూ అమెరికా గూఢచార విభాగం సీఐఏ తాజాగా పిలుపునిచ్చింది. అలాంటి వారు తమను సంప్రదించాలని కోరింది. చైనాలో వారికి భద్రత ఇస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించి చైనా అధికార భాష మాండరిన్‌లో రూపొందించిన వీడియోలను తాజాగా యూట్యూబ్, ఎక్స్‌లలో విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ వీడియోలకు విడుదలైన మొదటి రోజే 50 లక్షల వ్యూస్‌ రావడం గమనార్హం.

ఒక వీడియోలో కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రభుత్వంలో ఎంతో నిజాయతీతో పనిచేస్తున్న ఓ వ్యక్తి.. ‘పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, వాటి వల్ల తన కుటుంబ భద్రత ప్రమాదంలో పడిందని ఆందోళన చెందుతుంటాడు. వీడియోలో నేపథ్య సంగీత తీవ్రత పెరుగుతుండగా అతడు..‘నేను ఏ తప్పూ చేయలేదు. నేను భయంతో జీవించలేను..!’అంటూ తన స్మార్ట్‌ఫోన్‌తో సీఐఏను సంప్రదించే ప్రయత్నం చేస్తుంటాడు. సీఐఏ చిహ్నం కనిపించడంతో రెండు నిమిషాల నిడివిగల ఈ వీడియో ముగుస్తుంది. వీడియో కింద ఉన్న లింక్‌లో సీఐఏ అంటూ నకిలీ ఖాతాలుంటాయనే హెచ్చరికతోపాటు, సురక్షితంగా సంప్రదించడంపై సూచనలుంటాయి.

ఈ వీడియోలపై సీఐఏ డైరెక్టర్‌ జాన్‌ రాట్‌క్లిఫ్‌ స్పందించారు. కొత్తగా కొన్ని దేశాల్లో ముఖ్యంగా చైనాలో మనుషులను నియమించుకుని గూఢచర్య కార్యకలాపాలు ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. గూఢచర్యం కోసం అమెరికా అధికారులను చైనా వాడుకుంటున్నట్లు ఇటీవల వార్త లు వచ్చిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఆర్థికంగా, సైనికంగా, సాంకేతికత పరంగా ప్రపంచంపై ఆధిపత్యం చలాయించాలని చైనా కుట్రలు పన్నుతోందని తెలిపారు. ఇటువంటి బెడదపై తగురీతిలో స్పందిస్తామన్నారు. అందులో భాగంగానే ఈ వీడియోలను విడుదల చేశామని చెప్పారు. ఇటీవలే సీఐఏ కొరియన్, మాండరిన్, ఫార్సి భాషల్లో సీఐఏను సంప్రదించడమెలాగో వివరిస్తూ వీడియోలు విడుదల చేసింది. మూడేళ్ల క్రి తం రష్యన్‌ భాషలో నూ ఇలాంటి వీడియోనే సీఐఏ విడుదల చేయడం గమనార్హం.  

 

Advertisement
 
Advertisement
Advertisement