కాబూల్‌ దాడి: ముందే హెచ్చరించిన బైడెన్‌

US warns of specific, credible threat as Biden says new attack  - Sakshi

అఫ్గానిస్తాన్‌లోని కాబూల్‌ విమానాశ్రయంపై ఏ క్షణంలోనైనా దాడి జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు. వచ్చే 24 లేదంటే 36 గంటల్లో దాడి జరుగుతుందన్నారు. అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాలను ఈ నెల 31లోగా ఉపసంహరించాల్సిన నేపథ్యంలో గడువులోగా ఉగ్రవాదులు మళ్లీ దాడులకు తెగబడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

‘‘మా కమాండర్లు నాతో చెప్పారు. 24–36 గంటల్లో మళ్లీ దాడులు జరిగే అవకాశం అత్యధికంగా ఉంది. కాబూల్‌ పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి’’అని బైడెన్‌ చెప్పారు. కాబూల్‌లో ఉన్న ప్రతీ అమెరికన్‌కు రక్షణ కల్పించాల్సిన బాధ్యత తమ మీద ఉందని ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆ దేశంలో ఉన్న సైనిక బలగాలను ఆదేశించినట్టుగా బైడెన్‌ వెల్లడించారు.

ఐసిస్‌–కె ఉగ్రవాద సంస్థపై తాము చేసిన డ్రోన్‌ దాడి ఆఖరిది కాదని బైడెన్‌ అన్నారు. అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకున్న వారిని విడిచిపెట్టమని, పేలుళ్ల వెనుక హస్తం ఉన్న ప్రతీ ఒక్కరినీ మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకుంటామని బైడెన్‌ స్పష్టం చేశారు. అఫ్గాన్‌ నుంచి తరలింపును గడువులోగా పూర్తి చేస్తామన్నారు.  ఇంకా అక్కడ మిగిలి ఉన్న∙వారిని సురక్షితంగా తీసుకువచ్చే పనిలో ఉన్నామని బైడెన్‌ వివరించారు.

విమానాశ్రయం దగ్గర దాడులు జరిగే అవకాశం ఉండడంతో ఆ చుట్టు పక్కలకు ఎవరూ రావొద్దని,  వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అమెరికా విదేశాంగ శాఖ తమ పౌరులకు సూచించింది. అఫ్గానిస్తాన్‌లో ఉన్న తమ 300 మంది పౌరులను గడువులోగా తీసుకొస్తామని  జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలివాన్‌ అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top