వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ అణు చర్చలు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. ఇరాన్‌కు అమెరికా ఐదు కీలక షరతులను విధించింది. వాటిలో ప్రధానంగా 400 కిలోల యురేనియం అమెరికాకు అప్పగించాలి. ఇరాన్‌లో ఒక్క అణు కేంద్రం మాత్రమే కొనసాగాలి. గత ఆంక్షల వల్ల కలిగిన నష్టాలకు ఎటువంటి పరిహారం ఇవ్వబోం. విదేశాల్లో స్తంభించిన ఇరాన్ ఆస్తుల్లో 25 శాతం కూడా విడుదల చేయదు. అలాగే వివిధ యుద్ధ రంగాల్లో శాంతి కొనసాగింపుపై చర్చలు జరగాలి అని స్పష్టం చేసింది.
ఈ డిమాండ్లపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బదులుగా, ఇరాన్ తన షరతులను ప్రకటించింది. లెబనాన్ సహా అన్ని యుద్ధ రంగాల్లో శాంతి కొనసాగించాలి. అన్ని ఆంక్షలను తొలగించాలి. విదేశాల్లో స్తంభించిన నిధులను విడుదల చేయాలి. యుద్ధ నష్టాలకు పరిహారం ఇవ్వాలి. అలాగే హర్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలి అని తెలిపింది.
ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బకాయీ మాట్లాడుతూ.. అమెరికా-ఇజ్రాయెల్‌లు శాంతి పేరుతో యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. సంక్షోభాన్ని సృష్టించి, దాన్ని శాంతి పేరుతో మరింత పెంచడం అమెరికా-ఇజ్రాయెల్‌ల పాత పద్ధతి అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించారు. తమ ప్రతిపాదనలకు అమెరికా అంగీకరించకపోతే ఆ దేశ చెల్లింపు దారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు.
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్‌ను తీవ్రంగా కుదిపేశాయి. ప్రతిగా, ఇరాన్ హర్మూజ్ జలసంధి మార్గాలను అడ్డుకోవడంతో ప్రపంచ ఇంధన సరఫరా దెబ్బతింది. ఏప్రిల్ 8న పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో తాత్కాలిక కాల్పుల విరమణ కుదిరినా, శాశ్వత శాంతి ఒప్పందం సాధ్యం కాలేదు. ఇరాన్ సైన్యం అమెరికా మరోసారి దాడి చేస్తే మరింత తీవ్రమైన ప్రతీకారం ఉంటుందని పునరుద్ఘాటించింది.


