
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై అనుమానాలు
అది సాధారణ అనారోగ్యమేనన్న వైట్‌హౌస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(80) ఆరోగ్యంపై మరోసారి వదంతులు చెలరే గాయి. ఆదివారం న్యూజెర్సీలో జరిగిన ఫిపా క్లబ్ వరల్డ్ కప్ తిలకించేందుకు వచ్చిన ట్రంప్‌నకు కాళ్ల వద్ద నరాలు ఉబ్బిపోయినట్లుగా కనిపించడం, కుడి చేతిపై పలు చోట్ల వాపు కనిపించడంపై పలు దృశ్యాలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేశాయి. ట్రంప్ వాస్తవ ఆరోగ్య స్థితిని కప్పిపుచ్చేందుకు అధ్యక్ష యంత్రాంగం ప్రయత్నిస్తోందా? అంటూ ఎక్స్‌లో ఓ యూజర్ అనుమానం వ్యక్తం చేశాడు.
అధ్యక్షుడు ట్రంప్ శ్వాస సంబంధ సమస్యతో బాధపడు తున్నట్లుగా మరికొందరు నెటిజన్లు పేర్కొన్నారు. ఇలా వస్తున్న రకరకాల వదంతులపై అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందించారు. వీన్స్ ఇన్‌సఫియెన్సీ అనే సిరల వ్యాధితో ట్రంప్ బాధపడుతున్నారన్నారు. 70 ఏళ్లు దాటిన వారిలో సాధారణంగా కనిపించేదేనని చెప్పారు. ‘ట్రంప్ కాళ్ల దిగువ భాగంలో, చీలమండ వద్ద వాపును వైద్యులు పరీక్షించారు. దీన్ని సాధారణ లోపంగా నిర్ధారించారు. భయపడాల్సిన అవసరం లేదన్నారు’అని ఆమె తెలిపారు. ఇతర వైద్య పరీక్షల్లో గుండె వైఫల్యం, కిడ్నీ వైఫల్యం వంటివి లేనట్లు వైద్యులు చెప్పారని తెలిపారు.