ఇరాన్ అమెరికా మధ్య చర్చల విషయంలో ప్రస్తుతం తీవ్ర ప్రతిష్టంభన నడుస్తోంది. ఇరాన్ చర్చలకు ససేమిరా అనడంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్‌లో జరిగే రెండో విడత చర్చలకు ట్రంప్ స్వయంగా పాల్గొనే అవకాశం ఉందని రాయిటర్స్ కథనం పేర్కొంది.
ఇటీవల పాకిస్థాన్ ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య తొలివిడత చర్చలు జరిగాయి. అయితే ఇరు దేశాల మధ్య ఎటువంటి అంగీకారం కుదరకపోవడంతో ఎటువంటి ఒప్పందం లేకుండానే భేటీ ముగిసింది. అయితే మరో దఫా చర్చల కోసం అమెరికా ప్రయత్నిస్తుండగా ఇరాన్ మాత్రం అంగీకరించట్లేదు. యుఎస్‌ఏ పెట్టే డిమాండ్లకు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదని తేల్చిచెప్పింది.
ఈ నేపథ్యంలో అమెరికా కీలక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి జరిగే శాంతి చర్చలకు ట్రంప్ నేరుగా లేదా వర్చువల్‌గా పాల్గొనాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్‌తో రాయబారం కోసం ప్రయత్నిస్తున్నట్లు కీలక సమాచారం అందుతుంది. ఇరాన్ సైతం తొలుత చర్చలు జరపమని పట్టుబట్టినప్పటికీ ప్రస్తుతం సానూకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ట్రంప్ నేరుగా హాజరైతే చర్చల అంశం ఆశాజనకంగా ముగిసే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
చర్చలు విఫలానికి కారణం
ట్రంప్.. ప్రధానంగా ఇరాన్ ఎట్టిపరిస్థితుల్లో అణ్వాయుధాలు తయారు చేయకూడదని, హర్ముజ్ దిగ్భందనం తొలగించాలని కోరుతున్నారు. అయితే దీనికి ఇరాన్ ఒప్పుకోవడం లేదు. మరోవైపు అమెరికా యుద్ధ పరిహారం చెల్లించాలని, ఇరాన్ మీద ఉన్న ఆంక్షలన్నీ ఎత్తివేయాలని విదేశాల్లో ఫ్రీజ్ చేసిన ఇరాన్ డబ్బులు చెల్లించాలని కోరుతుంది. ఈ డిమాండ్లకు అమెరికా ఒప్పుకోవడం లేదు. దీంతో రెండు దేశాల మధ్య చర్చల విషయంలో ప్రతిష్ఠంభన నెలకొంది.
సెక్యూరిటీ నీడలో ఇస్లామాబాద్
చర్చల జరిగే ఇస్లామాబాద్ ప్రాంతం ప్రస్తుతం సెక్యూరిటీ నీడలో ఉన్నట్లు తెలుస్తోంది. చర్చల కోసం పాకిస్థాన్ సుమారు 20,000 మంది భద్రతా సిబ్బందిని ఇస్లామాబాద్‌లో మోహరించింది. తొలిదశ చర్చల సమయంలో సైతం ఇరాన్ అమెరికా ప్రతినిధులకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.


