యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసెంట్ దావోస్‌లో జరిగిన ఆర్థిక సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాతో భారత్ వాణిజ్యం విషయంలో యుఎస్ తీసుకున్న చర్యలు విజయవంతం అయ్యాయన్నారు. దీంతో భారత్‌పై అమెరికా విధిస్తున్న అధిక పన్నులను వెనక్కి తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
భారత్, రష్యా మైత్రిపట్ల తొలి నుంచి అమెరికాకు అక్కసుతోనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి భారత్ చమురు కోనకూడదని ఆంక్షలు విధించింది. భారత్ దానిని కేర్ చేయకపోవడంతో మన దేశం నుంచి అక్కడికి వెళ్లే ఎగుమతులపై 50 శాతం పన్నులు పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. అయినా భారత్ వెనక్కి తగ్గలేదు. దాని అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు వచ్చారు. ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ సంగతి తెలిసిందే.
అయితే ఈ అంశంపై అమెరికా ట్రెజరీ సెక్రటరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధించిన 50శాతం పన్నుల ఆలోచనను ప్రస్తుతం వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. "భారత్‌పై మేము విధించిన 25శాతం అధిక పన్నుల అంశం విజయవంతమైంది. రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోలు కుప్పకూలింది. అయినా పన్నులు కొనసాగుతున్నాయి.వాటిని వెనక్కి తీసుకోవాల్సిన అవసరముంది" అని ఆయన అన్నారు.
భారత్‌తో ఒక పెద్ద ఒప్పందం కోసం యూరోపియన్ యూనియన్ సిద్ధంగా ఉందని అందుకే భారత్ పై అధిక పన్నులు విధించలేదని బీసెంట్ తెలిపారు. ఇండియా నుంచి రిఫైన్డ్ ఎనర్జీ వస్తువులు కొనుగోలు చేయడం యూరోపియన్ల పనికిమాలిన చర్యని పేర్కొన్నారు. ట్రంప్ అధిక పన్నుల విధించడంతోనే భారత్ రష్యా నుంచి చమురు కొనడం ఆపేసిందన్నారు.
అయితే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్, రష్యా నుంచి అధిక మెుత్తంలో చమురు దిగుమతి చేసుకుంటుంది. కాగా మెుత్తంగా భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతి దారుగా ఉంది.


