వాషింగ్టన్: తంతే బంగారు పాన్పులో పడ్డాడు అనే సామెత మనం తరచుగా వాడుతుంటాం.. అమెరికాలో ఓ వ్యక్తి విషయంలో సరిగ్గా ఇటువంటి ఘటన జరిగింది. ఎన్నో ఏళ్లుగా వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్న ఓక వ్యక్తికి ఎట్టకేలకు అదృష్ట లక్ష‍్మీ కరుణించింది. అతని కష్టానికి డబుల్ బోనస్‌గా కోట్ల విలువ చేసే వజ్రం దొరికింది.
అమెరికాలోని అర్కాన్సాస్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్‌లో ఓ వ్యక్తికి అత్యంత అరుదైన పసుపు రంగు వజ్రం లభించింది. దాదాపు 6.03 క్యారెట్ల బరువున్నఈ వజ్రం జాక్ పీరాడిన్ అనే రత్నాల అన్వేషకుడికి దొరికింది. దీని విలువ సుమారు 10 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.8.3 కోట్ల నుంచి రూ.9.6 కోట్ల వరకు) ఉండవచ్చని అంచనా . ఈ వార్తను అక్కడి ప్రముఖ మ్యాగజైన్ పీపుల్ ప్రచురించింది.
వివరాల్లోకి వెళితే..ఈ ఏడాది జనవరిలోపీరాడిన్ తన స్నేహితుడు మైఖేల్ షూమేకర్‌తో కలిసి అక్కడి మట్టిని, చిన్న రాళ్లను వేరు చేస్తుండగా ఈ వజ్రం బయటపడింది. ఈ అరుదైన ఘటన టిక్‌టాక్‌లో ప్రత్యక్ష ప్రసారం కావడంతో ఇది మరింత వైరల్‌గా మారింది. గోరు పరిమాణంలో కనిపించిన ఆ రాయిని దగ్గరగా పరిశీలించగా అది అరుదైన పసుపు వజ్రమని గుర్తించి వారిద్దరూ ఆశ్చర్యపోయారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆ పార్కులో లభించిన వజ్రాల్లో ఇదే అతిపెద్దదని పార్కు అధికారులు ధ్రువీకరించారు.

అయితే ఈ వజ్రం లభించిన అనంతరం జాక్ పీరాడిన్ మాట్లాడుతూ.. “నేను దానికి సుమారు ఎనిమిది అడుగుల దూరంలో ఉన్నాను. అయితే, ఏదో కారణంతో వెనక్కి తిరిగి చూడగా, రాళ్ల కుప్ప మధ్యలో నుంచి అది మెరుస్తూ కనిపించింది” అని తెలిపారు. ఆయన వజ్రాల అన్వేషణ 2013లో ప్రారంభమైంది. అప్పట్లో సరదాగా ఈ పార్కును సందర్శించిన ఆయనకు వజ్రాల కోసం వెతకడంపై క్రమంగా ఆసక్తి పెరిగింది. ఇది కాస్త వ్యసనంగా మారింది. ఎంతలా అంటే చివరకు ఆ ప్రాంతానికి దగ్గరగా ఉండేందుకు మిస్సోరీ నుంచి అర్కాన్సాస్‌లోని మర్ఫ్రీస్‌బరో సమీపానికి మారిపోయారు.
అప్పటి నుంచి వజ్రాల కోసం నిరంతరం అన్వేషణ కొనసాగిస్తునే ఉన్నారు. అయితే, ఇన్నేళ్లుగా వజ్రాల కోసం వెతుకుతున్నప్పటికీ తన అభిరుచి పెద్దగా ఆర్థిక ప్రయోజనాన్ని అందించలేదని తెలిపారు. ఈ 13 ఏళ్ల కాలంలో ఆయన 300కు పైగా చిన్న వజ్రాలను గుర్తించినప్పటికీ వాటికి అంత విలువ లేదని పేర్కొన్నారు. అమెరికన్ డ్రీమ్ వజ్రంతో తన కల సాకారమైందని పేర్కొన్నారు.


