అమెరికాలో మినయాపాలిస్‌లో ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్‌కు వ్యతిరేకంగా జరగుతున్న నిరసనలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. శనివారం (జనవరి 24, 2026) ఫెడరల్ ఏజెంట్లు జరిపిన కాల్పుల్లో మరో అమెరికన్ పౌరుడు మరణించాడు. మరణించిన వ్యక్తిని 37 ఏళ్ల మినయాపాలిస్ నివాసిగా అధికారులు గుర్తించారు.
మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సదరు వ్యక్తి వద్ద తుపాకీతో పాటు రెండు మ్యాగజైన్లు ఉన్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది. అయితే అధికారులపైకి తిరగబడటంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మినయాపాలిస్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండో సారి. కొన్ని రోజుల క్రితం రెనీ నికోల్ గుడ్ అనే 37 ఏళ్ల మహిళను ఫెడరల్ ఏజెంట్లు ఆమె కారులోనే కాల్చి చంపారు.
ఈ క్రమంలో వరుస కాల్పుల ఘటనలతో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. నిరసనకారులను చెదరగొట్టడానికి ఫెడరల్ ఏజెంట్లు బాష్పవాయువు ప్రయోగించారు. అయితే ఇదే సమయంలో ఓ ఐసీఈ ఏజెంట్ నిరసనకారులను వెక్కిరిస్తూ గట్టి అరిచాడు.
దీంతో నిరసనలు మరింత తీవ్రమయ్యాయి. ఈ ఘటనపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ స్పందించారు. మిన్నెసోటా ప్రజల సహనం నశించింది. ఇది అత్యంత క్రూరమైన చర్య. అధ్యక్షుడు ట్రంప్ వెంటనే ఈ ఆపరేషన్‌ను నిలిపివేయాలి. వేల సంఖ్యలో ఉన్న ఈ ఫెడరల్ అధికారులను వెంటనే మిన్నెసోటా నుండి వెనుక్కి పిలవాలి అని వాల్జ్ డిమాండ్ చేశారు.
కాగా అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులను ఏరివేయడానికి దేశవ్యాప్తంగా భారీ ఆపరేషన్లు చేపట్టింది. ఇందులో భాగంగానే వేల సంఖ్యలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, బార్డర్ పెట్రోల్ ఏజెంట్లు మినయాపాలిస్ వంటి నగరాలకు పంపారు.


