
కోర్సులు మధ్యలో వదిలేస్తే స్టూడెంట్ వీసా రద్దు
మళ్లీ వీసా కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉండదు
వీసా నిబంధనలకు విదేశీ విద్యార్థులు కట్టుబడి ఉండాలి
భారత్‌లోని యూఎస్ ఎంబసీ సూచన
వాషింగ్టన్: అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తరగతులకు డుమ్మా కొట్టినా లేక కోర్సులు మధ్యలో వదిలేసినా వీసా రద్దు కావడం ఖాయం. భవిష్యత్తులో వీసా కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం కూడా ఉండదు. అంటే అమెరికాలో మళ్లీ అడుగు పెట్టడం చాలా కష్టమనే చెప్పొచ్చు.
విద్యాసంస్థకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా తరగతులకు గైర్హాజరు కావడం లేదా కోర్సును మధ్యలోనే వదిలేయడం వంటివి చేస్తే విద్యా వీసా రద్దవుతుందని ఇండియాలోని అమెరికా ఎంబసీ తేల్చిచెప్పింది. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. వీసా నిబంధనలకు ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టుబడి ఉండాలని తేల్చిచెప్పింది. అమెరికాలో చదువుకుంటున్న కాలం లో సమస్యలేవీ రాకుండా ఉండాలంటే స్టూడెంట్ స్టేటస్ కోల్పోకుండా జాగ్రత్తపడాలని పేర్కొంది. అమెరికాలో లక్షలాది మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతిఏటా వీరి సంఖ్య పెరుగుతోంది.
విదేశీ విద్యార్థుల్లో ట్రంప్ గుబులు
అమెరికాలోని విదేశీ విద్యార్థులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ముందస్తుగా నోటీసు ఇవ్వకుండానే వీసాలు రద్దు చేస్తోంది. దాంతో చాలామంది అమెరికాను వీడి స్వదేశాలకు వెళ్లిపోవాల్సి వస్తోంది. పాలస్తీనాకు అనుకూలంగా నిరసనల్లో పాల్గొన్నవారి వీసాలు రద్దయ్యాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలినా వేటు పడింది. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలపై న్యాయ పోరాటం చేసే శక్తి లేని విద్యార్థులు మౌనంగా స్వదేశాల బాట పడుతున్నారు. న్యాయ పోరాటంలో గెలిచిన విద్యార్థులు సైతం కొందరు ఉన్నారు. కానీ, వారి సంఖ్య చాలా స్వల్పం.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఆధ్వర్యంలోని స్టూడెంట్ అండ్ ఎక్స్‌చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(సెవిస్) నుంచి విదేశీ విద్యార్థుల వివరాలను హఠాత్తుగా తొలగిస్తున్నారు. దాంతో వారు అమెరికా వదిలి వెళ్లాల్సి వస్తోంది. ఇలా తొలగిస్తున్నట్లు విద్యార్థులకు గానీ, యూనివర్సిటీలకు గాను ముందుగా తెలియజేయడం లేదు. మరోవైపు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) సదుపాయాన్ని తొలగించాలని ట్రంప్ సర్కారు నిర్ణయించడం విదేశీ విద్యార్థుల్లో గుబులు రేపుతోంది.
ఈ మేరకు ఫెయిర్‌నెస్ ఫర్ హై–స్కిల్డ్ అమెరికన్స్ యాక్ట్–2025 పేరిట ఒక బిల్లును ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ బిల్లు చట్టంగా మారితే.. గ్రాడ్యుయేషన్ తర్వాత విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉద్యోగాలు చేసుకొనేందుకు అవకాశం ఉండదు. చదువు పూర్తికాగానే సొంత దేశాలకు వెళ్లిపోవాల్సిందే.