
పారిస్: దక్షిణ ఫ్రాన్స్‌లో కార్చిచ్చు వేగంగా వ్యాప్తి చెందుతోంది. స్పెయిన్ సరిహద్దులో అడవిలో నిప్పంటుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో తొమ్మది మంది గాయపడ్డారు. ఒకరు గల్లంతయ్యారు. ఔదీ ప్రాంతంలోని రిబాటీలో మంగళవారం మధ్యాహ్నం మొదలైన మంటలు బుధవారం మరికొన్ని ప్రాంతాలకు వ్యాపించాయి. మంటలు ఆర్పేందుకు 1,500 మంది అగి్నమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.
రాజధాని పారిస్ విస్తీర్ణంతో సమానమైన ప్రాంతంలో కార్చిచ్చు రగిలినట్లు అధికారులు వెల్లడించారు. కేవలం 12 గంటల వ్యవధిలో 11,000 హెక్టార్ల భూభాగాన్ని మంటలు చుట్టుముట్టాయని తెలిపారు. ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద కార్చిచ్చు అని స్పష్టంచేశారు. దక్షిణ యూరప్‌లో వేసవి కాలంలో కార్చిచ్చులు రగలడం గత కొన్నేళ్లుగా పరిపాటిగా మారిపోయింది. కాలుష్యం, వాతావరణ మార్పులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.