ఉక్రెయిన్‌ సంక్షోభంపై కమలా హారిస్‌ ట్వీట్‌ మిస్‌ఫైర్‌! ఆమె మూర్ఖత్వం మహా ప్రమాదమంటూ..

Ukraine Crisis: Kamala Harris Tweet Mistake Leads Criticism - Sakshi

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌.. ఉక్రెయిన్‌ సంక్షోభ సమయంలో వేసిన ఓ ట్విటర్‌ పోస్ట్‌ దుమారం రేపుతోంది. ఉక్రెయిన్‌ నాటో కూటమిలో భాగమేనంటూ అర్థం వచ్చేలా ట్వీట్‌ చేసిన ఆమె.. కాసేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశారు. కానీ, ఈ లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌.. ఉక్రెయిన్‌ సంక్షోభ సమయంలో యూరప్‌లో పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా పోల్యాండ్‌ వెళ్లిన ఆమె.. అక్కడి ప్రెసిడెంట్‌ అండ్ర్‌జెజ్‌ డూడాతో రష్యా దురాక్రమణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె పోల్యాండ్‌ అధికారులకు, పోల్యాండ్‌లోని అమెరికా రక్షణ అధికారులతోనూ భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమె ట్విటర్‌లో పోస్ట్‌ చేసి.. ఉక్రెయిన్‌ వెంట అమెరికా ఉందంటూ ట్వీట్‌ చేశారు. 

అయితే ఆమె చేసిన ట్వీట్‌లో ఉక్రెయిన్‌, నాటో కూటమిలో భాగం అని అర్థం వచ్చేలా ఉంది. ఆ పోస్ట్‌కి నెగెటివ్‌ కామెంట్లు వస్తుండడంతో అసలు విషయం అర్థమైన ఆమె.. గంట తర్వాత ఆ ట్వీట్‌ తొలగించి.. మరో ట్వీట్‌ చేశారు. చివర్లో మరియు and అనే పదం చేర్చి మరోసారి ట్వీట్‌ చేశారు. కానీ, అప్పటికే కమలా హారిస్‌ డిలీట్‌ చేసిన ట్వీట్‌ తాలుకా స్క్రీన్‌ షాట్లు షేర్‌ అయ్యాయి. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అమెరికా ఉపాధ్యక్షురాలికి వాస్తవ పరిస్థితుల మీద కనీస అవగాహన కూడా లేదు. ఆమె మూర్ఖత్వం మహా ప్రమాదకరమంటూ మాజీ భద్రతా అధికారి డెర్రిక్‌ కామెంట్‌ చేశాడు. ఈయనే కాదు.. వేలమంది యూజర్లు కమలా హారిస్‌ రాంగ్‌పోస్ట్‌పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top