UK political crisis: బ్రిటన్‌లో రిషీరాజ్‌..

UK political crisis: Rishi Sunak Is Britain New Prime Minister - Sakshi

కొత్త చరిత్ర సృష్టించిన మన రిషి సునాక్

దేశ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నిక

ఈ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా, శ్వేతేతరునిగా రికార్డు

అప్పుడే  బాధ్యతలు స్వీకరించి రంగంలోకి

ఆర్థిక సవాళ్లను అధిగమిస్తానంటూ ప్రతిజ్ఞ

ప్రపంచ సమస్యల పరిష్కారానికి  రిషితో కలసి పనిచేసేందుకు ఆసక్తితో ఉన్నా: ప్రధాని మోదీ

లండన్‌: నూటా యాభయ్యేళ్లకు పైగా మనల్ని పాలించిన బ్రిటన్‌ను ఇక మనవాడు పాలించనున్నాడు. దేశ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ (42) సరికొత్త చరిత్ర లిఖించారు. సోమవారం పలు ఆసక్తికర పరిణామాల నడుమ అధికార కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తద్వారా బ్రిటన్‌ ప్రధాని పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న నేతగా రికార్డు సృష్టించారు.

ఈ ఘనత సాధించిన తొలి శ్వేతేతరుడు కూడా రిషియే కావడం మరో విశేషం! అంతేగాక గత 210 ఏళ్లలో అతి పిన్న వయస్కుడైన బ్రిటన్‌ పీఎంగా కూడా రిషి మరో రికార్డు నెలకొల్పారు.  ప్రధాన పోటీదారుగా భావించిన మాజీ ప్రధాని బోరిస్‌ సోమవారం అనూహ్యంగా తప్పుకోవడంతో ఆయనకు ఒక్కసారిగా లైన్‌ క్లియరైంది. మూడో అభ్యర్థి పెన్నీ మోర్డంట్‌ గడువు లోపు 100 మంది ఎంపీల మద్దతు కూడగట్టడంలో విఫలమవడంతో రిషి ఎన్నిక ఏకగ్రీవమైంది.

అలా, నెలన్నర క్రితం లిజ్‌ ట్రస్‌తో హోరాహోరీగా జరిగిన పోటీలో అందినట్టే అంది తృటిలో చేజారిన ప్రధాని పదవి ఈసారి రిషిని వచ్చి వరించింది. తాను హిందువునని ప్రతి వేదికపైనా సగర్వంగా ప్రకటించుకునే రిషి సరిగ్గా దీపావళి పర్వదినం నాడే ప్రధానిగా ఎన్నికవడం భారతీయుల హర్షోత్సాహాలను రెట్టింపు చేసింది. మంగళవారం టోరీ ఎంపీలనుద్దేశించి ప్రసంగించాక ఆయన రాజు చార్లెస్‌–3ని కలిశారు. అనంతరం దేశ 57వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

అస్తవ్యస్తంగా మారిన బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే గురుతర బాధ్యత ఇప్పుడు రిషి భుజస్కంధాలపై ఉంది. ఈ విషయంలో విఫలమవడం వల్లే ట్రస్‌ కేవలం 45 రోజులకే రాజీనామా చేయాల్సి రావడం, బ్రిటన్‌ చరిత్రలో అత్యంత తక్కువ కాలం పీఎంగా కొనసాగిన చెత్త రికార్డును మూటగట్టుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గా తన అపారమైన ఆర్థిక అనుభవాన్ని రంగరించి దేశాన్ని రిషి ఎలా ఒడ్డున పడేస్తారన్నది ఆసక్తికరం.

ప్రధాని అధికార నివాసం 10, డౌనింగ్‌ స్ట్రీట్‌ నుంచి చేసిన తొలి అధికారిక ప్రసంగంలోనూ రిషి ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. బ్రిటన్‌ అత్యంత కఠినమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అంగీకరించారు. ‘‘ఈ సవాలును దీటుగా ఎదుర్కొనేందుకు ఏ మాత్రం వెనకాడబోను. నాపై ఉన్న ఆకాంక్షలను పూర్తిగా నెరవేరుస్తా’’అంటూ ప్రతిజ్ఞ చేశారు. దేశాన్ని బంగారు భవిష్యత్తులోకి నడిపిస్తానంటూ నిండైన ఆత్మవిశ్వాసంతో దేశవాసులకు హామీ ఇచ్చారు.

రెండు నెలల్లో మూడో ప్రధాని!
బోరిస్‌ జాన్సన్, ట్రస్‌ తర్వాత గత ఏడు వారాల్లో బ్రిటన్‌కు రిషి మూడో ప్రధాని కావడం విశేషం. పార్టీ గేట్‌ కుంభకోణం తదితరాల దెబ్బకు మంత్రులు సొంత పార్టీ ఎంపీల డిమాండ్‌కు తలొగ్గి జాన్సన్‌ రాజీనామా చేయడం తెలిసిందే. అనంతరం సెప్టెంబర్లో జరిగిన హోరాహోరీ పోరులో రిషిపై నెగ్గి ట్రస్‌ ప్రధాని అయ్యారు. కానీ పన్ను కోతలు, అనాలోచిత మినీ బడ్జెట్‌తో ఆర్థిక పరిస్థితిని పెనం నుంచి పొయ్యిలో పడేశారంటూ ఇంటా బయటా తీవ్ర విమర్శల పాలయ్యారు.

తప్పుకోవాలంటూ సొంత ఎంపీలే డిమాండ్‌ చేయడం, అవసరమైతే అవిశ్వాసం పెట్టేందుకూ సిద్ధమవడంతో మరో మార్గం లేక ఆమె గురువారం రాజీనామా ప్రకటించారు. మంగళవారం ఆపద్ధర్మ ప్రధాని హోదాలో ట్రస్‌ చివరి కేబినెట్‌ సమావేశానికి సారథ్యం వహించారు. అనంతరం బకింగ్‌హం ప్యాలెస్‌కు వెళ్లి చార్లెస్‌–3కి లాంఛనంగా రాజీనామా సమర్పించారు. తర్వాత రిషి రాజసౌధానికి వెళ్లి రాజుతో లాంఛనంగా భేటీ అయ్యారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న రాజు ఆహ్వానాన్ని అంగీకరిస్తూ రాచరిక సంప్రదాయాన్ని అనుసరించి ఆయన ముంజేతిని ముద్దాడారు. కల్లోల సమయంలో కఠిన బాధ్యతలను చేపడుతున్న రిషి తన బాధ్యతలను సమర్థంగా నెరవేర్చాలంటూ ప్రార్థించాల్సిందిగా బ్రిటన్‌ పౌరులకు కాంటర్‌బరీ ఆర్చిబిషప్‌ జస్టిన్‌ వెల్బీ పిలుపునిచ్చారు. ‘‘ఇది మన దేశానికి అత్యంత కష్టకాలం. ఈ అస్థిర పరిస్థితుల్లో బాధ్యతలు చేపడుఉతన్న రిషి కోసం నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా’’అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని గ్టటెక్కించగలిగే సత్తా ఉన్న నేత రిషి మాత్రమేనని టోరీ ఎంపీల్లో అత్యధికులు నమ్ముతున్నారు. వారిలో సగం మందికి పైగా ఆయనకు బాహాటంగా మద్దతు ప్రకటించడం అందుకు నిదర్శనంగా నిలిచింది.
 
అభినందనల వెల్లువ...
రిషికి నా హార్దిక శుభాభినందనలు. బ్రిటన్‌తో భారత్‌ చారిత్రక సంబంధాలను ఆధునిక భాగస్వామ్యంగా మార్చుకుంటున్న వేళ ఇది నిజంగా గొప్ప పరిణామం. ప్రపంచ సమస్యల పరిష్కారానికి రిషితో కలిసి పని చేసేందుకు, 2030–రోడ్‌మ్యాప్‌ను  అమలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నా
– ప్రధాని నరేంద్ర మోదీ

రిషి సాధించింది అపురూప విజయం. ఇదో చరిత్రాత్మక మైలు రాయి. ప్రపంచ భద్రత, ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా
ఎదురు చూస్తున్నా  

– అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌

 ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, యూరప్, మిగతా ప్రపంచంపై దాని ప్రభావాలను రిషితో కలిసి ఉమ్మడిగా ఎదుర్కొంటాం
– ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌

రిషికి హార్దిక అభినందనలు. ఆయన హయాంలో బ్రిటన్‌–ఉక్రెయిన్‌ బంధం మరింత బలపడాలి
– ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

పలు అంశాలపై ఆయనతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం
– ఐర్లండ్‌ ప్రధాని మైఖేల్‌ మార్టిన్‌

రిషి హయాంలో బ్రిటన్‌–ఈయూ సంబంధాలు ఇరుపక్షాల ఒప్పందాలను పరస్పరం గౌరవిస్తూ సాగుతాయని ఆశిస్తున్నాం
– యూరోపియన్‌ కమిషన్‌ ప్రసిడెంట్‌ ఉర్సులా వాండెర్‌ లియాన్‌  

ఇదో చరిత్రాత్మక రోజు. రిషికి అభినందనలు. టోరీ ఎంపీలంతా కొత్త ప్రధానికి పూర్తి మద్దతివ్వాల్సిన వేళ ఇది  
 – బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌

ప్రధానిగా పని చేయడం నాకు దక్కిన అతి గొప్ప గౌరవం. రిషికి నా అభినందనలు. అన్ని అంశాల్లో నూ ఆయనకు నా పూర్తి
మద్దతుంటుంది

 – బ్రిటన్‌ తాజా మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌

రిషికి శుభాకాంక్షలు
– కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో

రిషికి అభినందనలు. కానీ దేశంలో తక్షణం ఎన్నికలు జరపాల్సిన అవసరముంది
– బ్రిటన్‌ విపక్ష లేబర్‌ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌  

రిషి వచ్చినా బ్రిటన్‌తో సమీప భవిష్యత్తులోనూ రష్యా సంబంధాలు మెరుగు పడతాయన్న ఆశలేమీ లేవు  
– రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్‌

రిషి హయాంలో బ్రిటన్‌తో చైనా సంబంధాలు ముందుకు వెళ్తాయని ఆశిస్తున్నాం  
  – చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌  

రిషిని చూసి ఎంతో గర్విస్తున్నాం. ప్రధానిగా అద్భుతంగా పాలించాలని కోరుకుంటున్నాం.
 – రిషి మామ, ఇన్ఫోసిస్‌ సహ–వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top