Turkey–Syria Earthquake: 24 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య

Turkey–Syria Earthquake: heartbreaking scenes at Turkey–Syria - Sakshi

తుర్కియే, సిరియాలో ముమ్మరంగా శిథిలాల తొలగింపు

100 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడుతున్న పలువురు!

మూత్రం తాగి ప్రాణాలు నిలుపుకున్న వైనం

22 వేలు దాటిన మృతులు

అంకారా/న్యూఢిల్లీ:  తుర్కియే(టర్కీ), సిరియాలో భూకంప మృతుల సంఖ్య ఏకంగా 24,000 దాటింది. సహాయక చర్యలతోపాటు శిథిలాల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. భీకర భూకంపం సంభవించి 100 గంటలు గడిచిపోయింది. శిథిలాల కింద మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. కొందరు సజీవంగా బయటపడడం ఊరట కలిగిస్తోంది. తుర్కియేలో శిథిలాలను తొలగిస్తుండగా శుక్రవారం ఒక్కరోజే 100 మందికిపైగా బాధితులు ప్రాణాలతో బయటకు వచ్చారు. కొన్నిచోట్ల హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి.

తీవ్రమైన చలిలో ఆకలి బాధలతో ప్రాణాలు నిలుపుకొనేందుకు వారుపడిన కష్టాలు వర్ణనాతీతం. శిథిలాల కింద ఇరుక్కుపోయి, బయటపడే మార్గం లేక కేవలం మూత్రం తాగి ఆకలిదప్పులు తీర్చుకున్నామని బాధితులు చెబుతుండడం కన్నీరు పెట్టిస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. తుర్కియేలో అంత్యక్రియల కోసం తీసుకొస్తున్న మృతదేహాలతో ఇప్పటికే శ్మశానాలు కిక్కిరిసిపోతున్నాయి. చాలా సమయం వేచి చూడాల్సి వస్తోందని మృతుల బంధువులు చెబుతున్నారు.

ఈ భూకంపం ‘ఈ శతాబ్దపు విపత్తు’ అని తుర్కియే అధ్యక్షుడు తయీఫ్‌ ఎర్డోగాన్‌ వ్యాఖ్యానించారు. భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయిన తుర్కియేకు దాదాపు 95 దేశాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. సిరియా అధ్యక్షుడు బషర్‌ అసద్, ఆయన భార్య అస్మా శుక్రవారం అలెప్పో యూనివర్సిటీ ఆసుపత్రిలో భూకంప మృతులను పరామర్శించారు. భూకంపం సంభవించినప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి.  

75,000 మంది నిరాశ్రయులు
భూకంపం వల్ల తుర్కియేలో ఇప్పటిదాకా 18,900 మంది మరణించారని, దాదాపు 75,000 మంది గాయపడ్డారని తుర్కియే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ వెల్లడించింది. ఇళ్లు కూలిపోవడంతో 75,000 మందికిపైగా జనం నిరాశ్రయులైనట్లు అంచనా వేస్తున్నామని తెలిపింది. సిరియాలో భూకంపం కారణంగా 3,300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ధ్రువీకరించింది. రెండు దేశాల్లో కలిపి ఇప్పటివరకు 22,000 మందికి పైగా బలైనట్లు తెలుస్తోంది. తుర్కియేలో 12,000 దాకా భవనాలు నేలమట్టం కావడమో లేక దెబ్బతినడమో జరిగిందని మంత్రి మురాత్‌ కరూమ్‌ చెప్పారు.  

తుర్కియే ప్రజలకు అండగా ఉంటాం: మోదీ  
‘ఆపరేషన్‌ దోస్త్‌’లో భాగంగా తుర్కియేలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మన దేశ సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం తెలిపారు. రిలీఫ్, రెస్క్యూ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొంటున్నాయని చెప్పారు. సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రాణాలను, ఆస్తులను కాపాడడానికి మన బృందాలు కృషి చేస్తూనే ఉంటాయని ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ సంక్షోభ సమయంలో తుర్కియే ప్రజలకు భారత్‌ పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని మోదీ హామీ ఇచ్చారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top