ఇరాన్ నేతల ఏడుపు.. అంతా ఫేక్!.. నోటి దురుసు ట్రంప్‌ | Trump Warns Iranian Leaders At Ali Khamenei Funeral, Says Talks Still Possible Amid Tensions | Sakshi
Sakshi News home page

ఇరాన్ నేతల ఏడుపు.. అంతా ఫేక్!.. నోటి దురుసు ట్రంప్‌

Jul 5 2026 8:59 AM | Updated on Jul 5 2026 12:46 PM

Trump Warns Iranian Leaders At Ali Khamenei Funeral

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ.. ఆ దేశంలో మిగిలి ఉన్న కీలక నాయకత్వాన్ని తాము ఒకే ఒక్క షాట్‌తో అంతమొందించగలమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, అలా చేస్తే భవిష్యత్తులో చర్చలు జరపడానికి ఎవరూ మిగలరు కాబట్టి తాను ఆ పని చేయడం లేదని ట్రంప్ పేర్కొన్నారు. అదే సమయంలో ఖమేనీ అంత్యక్రియల్లో తీరని ఆవేదనతో కన్నీరు మున్నీరవుతున్న నేతలను ఉద్దేశిస్తూ ట్రంప్‌ తన నోటికి పని చెప్పారు.  

అమెరికన్ మీడియా సంస్థ ‘ఆక్సియోస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఇరాన్ నేతలందరూ ఖమేనీ అంత్యక్రియల్లో ఉన్నారు. ఒక్క షాట్‌తో వారందరినీ మేము తుడిచిపెట్టేయగలము. కానీ మేము ఆ పని చేయబోవడం లేదు. ఎందుకంటే ఆ తర్వాత చర్చలు జరపడానికి అక్కడ ఎవరూ ఉండరు. నిజానికి వారు మాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి అర్ధరిస్తున్నారు అని వ్యాఖ్యానించారు.

ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు ముగిసే వరకు చర్చల నుంచి వారం రోజుల పాటు విరామం తీసుకోవాలని ఇరు పక్షాలు నిర్ణయించుకున్నట్లు కూడా ట్రంప్ స్పష్టం చేశారు. ఈ లోపు ఏ పక్షం కూడా అవతలి పక్షంపై ఎలాంటి దాడులు చేయబోవని ఆయన వెల్లడించారు. 

 


ఖమేనీ అంత్యక్రియలపై ట్రంప్‌ ఆశ్చర్యం
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అంతిమ వీడ్కోలు కార్యక్రమంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘేర్ గాలిబాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీలు కన్నీరు పెట్టుకుంటూ కనిపించారు. ఖమేనీ అంత్యక్రియలకు వేలాది మంది హాజరుకాగా, ఇరాన్ నేతలు భావోద్వేగానికి లోనై ఏడ్చారు. అయితే, అంత్యక్రియల్లో ఇరాన్ ప్రజలు, నేతలు ఏడవడంపై డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలు ఖమేనీని  ద్వేషిస్తారని తాను అనుకున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. బహుశా అవి నకిలీ కన్నీళ్లు కావచ్చు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  

కొనసాగుతున్న అంత్యక్రియలు
ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు ప్రస్తుతం అధికారికంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఆయన మరణించగా, యుద్ధ పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ అంతిమ సంస్కారాలు జూలై మొదటి వారంలో ప్రారంభమయ్యాయి. ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలను ఇరాన్, ఇరాక్‌లలోని 5 ప్రధాన నగరాల్లో జూలై 3 నుండి జూలై 9 వరకు 7 రోజుల పాటు నిర్వహించేలా ఇరాన్ ప్రభుత్వం షెడ్యూల్ చేసింది.  

జూలై 4, 5 తేదీల్లో రాజధాని టెహ్రాన్‌లోని ‘గ్రాండ్ మొసల్లా’ ప్రార్థనా మందిరంలో ఖమేనీ, ఆయనతో పాటు మరణించిన కుటుంబ సభ్యుల పార్థివ దేహాలను ప్రజల సందర్శనార్థం ఉంచారు. లక్షలాది మంది ప్రజలు ఆయనకు నివాళులర్పించేందుకు తరలివస్తున్నారు. టెహ్రాన్ తర్వాత ఈ అంతిమయాత్ర కోమ్ నగరానికి, ఆపై ఇరాక్‌లోని ప్రముఖ షియా పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బలాలకు తరలివెళ్తుంది.  చివరగా జూలై 9న ఖమేనీ సొంత పట్టణమైన ఇరాన్‌లోని అత్యంత పవిత్ర నగరం మషహద్‌లో ఆయన భౌతిక కాయాన్ని అధికారికంగా ఖననం చేయనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement