ట్రంప్‌ మద్దతుదారుల అట్టర్‌ఫ్లాప్‌ షో

Trump Supporters Protest show utter Flop - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: ఎన్నికల్లో ఓడిపోయినా ఎలాగైనా పదవిని పట్టుకుని వేలాడాలనుకున్న వ్యక్తి డొనల్డ్‌ ట్రంప్‌. అధ్యక్ష పదవిలో ఉండేందుకు అడ్డదారులు తొక్కి ప్రపంచంలోనే అతి పురాతనమైన ప్రజాస్వామ్య దేశంగా ఉన్న అమెరికాను అభాసుపాలయ్యేలా చేశాడు. అలాంటి వ్యక్తిని సోషల్‌ మీడియా బహిష్కరించింది. ఈ క్రమంలోనే మొన్న ట్విట్టర్‌ ట్రంప్‌ ఖాతాను శాశ్వతంగా తొలగించింది. అయితే ఈ ఖాతా తొలగింపుపై కూడా ట్రంప్‌ మద్దతుదారులు బీభత్సం చేయాలని భావించారు. కానీ వారు చేయాలనుకున్న ప్రయత్నం బెడిసికొట్టింది. ట్విట్టర్‌ ప్రధాన కార్యాలయం ఎదుట చేపట్టాల్సిన నిరసన కార్యక్రమం అట్టర్‌ ఫ్లాపయ్యింది. 

క్యాపిటల్‌ హౌస్‌పై దాడిని ప్రేరేపించారని తెలియడంతో 88 మిలియన్ల మంది ఫాలోయింగ్‌ ఉన్న ట్రంప్‌ ఖాతాను నిలిపివేసిన విషయం తెలిసిందే. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్‌ ప్రధాన కార్యాలయం ఎదుట సోమవారం (జనవరి 11) ట్రంప్‌ మద్దతుదారులు, అభిమానులు ఆందోళన చేయాలని సిద్ధమయ్యారు. ఈ విషయం ముందే తెలుసుకున్న అక్కడి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ట్రంప్‌ ఖాతాను పునరుద్ధరించాలని ట్రంప్‌ అభిమానులు డిమాండ్‌పై నిరసనకు దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ నిరసన కార్యక్రమానికి తక్కువ సంఖ్యలో ట్రంప్‌ అభిమానులు హాజరయ్యారు. పోలీస్‌ బందోబస్తు చూసి చాలామంది భయపడి విరమించుకున్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు. 

డొనల్డ్‌ ట్రంప్‌ ఖాతాలను ఫేసుబుక్‌, స్నాప్‌చాట్‌ కూడా నిషేధించింది. మిగతా సోషల్‌ మీడియా సంస్థలు ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమెరికా చరిత్రలో అత్యంత పరువు పోగొట్టుకున్న అధ్యక్షుడిగా ట్రంప్‌ నిలిచారని పలువురు పేర్కొంటున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top