
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరోసారి టారిఫ్ బాంబు పేల్చారు. అదనంగా మరో 25 శాతం టారిఫ్ విధించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై(Executive Order) ఇవాళ ఆయన సంతకం చేసినట్లు పలు జాతీయ మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. ఆగస్టు 27వ తేదీ నుంచి తాజా టారిఫ్ అమల్లోకి రానున్నట్లు సమాచారం.
భారత్ మిత్రదేశమే అయినా, వాణిజ్య పరంగా అడ్డంకులు ఎక్కువగా ఉన్నాయి అంటూ గత కొంతకాలంగా ఆయన చెబుతూ వస్తున్నారు. అదే సమయంలో రష్యా నుంచి భారత్ చమురు, సైనిక ఉత్పత్తులను అధిక మొత్తంలో దిగుమతి చేసుకోవడంపైనా ఆయన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
భారత్ మిత్రదేశమే అయినా.. సుంకాలు ఎక్కువగా ఉన్నందున వారితో పరిమిత స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నాం. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి. ఏ దేశంలో లేని విధంగా వాణిజ్యపరంగా అక్కడ అడ్డంకులున్నాయి. రష్యా నుంచి భారీ స్థాయిలో సైనిక ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్‌పై దాడులను ప్రపంచమంతా ఖండిస్తోంది. భారత్, చైనాలు మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. అందుకే భారత్‌పై 25శాతం సుంకాలు అదనంగా పెనాల్టీ కూడా విధిస్తున్నాం అని ఆ సమయంలో అన్నారాయన.
మరో అల్టిమేటం, ఆ వెంటనే..
అయితే భారత్‌పై టారిఫ్‌లను పెంచే విషయమై తాజాగానూ ఆయన మరో ప్రకటన చేశారు. ‘‘మాతో భారత్ బాగానే వ్యాపారం చేస్తోంది. కానీ మేం ఆ దేశంతో వ్యాపారం తక్కువగానే చేస్తాం. అందుకే 25శాతం సుంకాలను విధించాం. కానీ 24 గంటల్లో దీనిని భారీగా పెంచనున్నాం. రష్యా నుంచి చమురును కొనడంద్వారా వారు యుద్ధ ఇంజిన్‌కు ఇంధనాన్ని అందిస్తున్నారు. దీంతో నేను సంతోషంగా లేను’’ అని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు.
అయితే ఈ పరిణామాల తర్వాత కూడా.. రష్యా నుంచి ఇంకా ఆయిల్ కొనుగోలు చేస్తున్నందునే ఆయన మరో 25 శాతం టారిఫ్ వడ్డనతో ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు 50 శాతానికి చేరాయి. తాజా సుంకాల పెంపుపై అర్ధరాత్రి తర్వాత ఆయన అధికారికంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది. ట్రంప్ టారిఫ్ మోతపై ఇటు భారత ప్రభుత్వమూ స్పందించాల్సి ఉంది.
భారత్‌పైనే అత్యధికమా?
ట్రంప్ ఇప్పటిదాకా అత్యధికంగా టారిఫ్ విధించిన దేశంగా సిరియా ఇప్పటిదాకా ఉంది. 41 శాతం ఒకే విడతలో సిరియాపై అంత మొత్తంలో సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. మయన్మార్&లావోస్‌పై 40 శాతం, స్విట్జర్లాండ్‌పై 39 శాతం, కెనడా.. ఇరాక్‌లపైనా 35 శాతం టారిఫ్ విధించారాయన. అయితే భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు 50 శాతానికి చేరినా.. అది రెండు విడతల్లో ప్రకటించారు. పైగా రెండో దఫా మోపిన 25 శాతం ఇంకా అధికారికంగా అమల్లోకి రాలేదు.
