ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ ప్రతిదారులు నేపథ్యంలో మధ్యప్రాచ్యంలోని ప్రస్తుత పరిస్థిలా ఆందోళన కరంగా పరిణమిస్తోంది. సముద్ర మార్గ ఇంధన వాణిజ్యం కోసం హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవాలంటూ ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 48 గంటల గడువు, భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 5.14 గంటలకు ముగుస్తుంది.
హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం అత్యంత కీలకమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఇరాన్‌ను కోరారు. అటు తమ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి జరిగితే ఆ జలమార్గాన్ని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది.
ఇదీ చదవండి: చమురు, గ్యాస్ సమస్యలపై ప్రధాని మోదీ కీలక హామీ
మరోవైపు ట్రంప్ 48 గంటల గడుపు, చమురు కేంద్రాలపై దాడులు హెచ్చరికలపై స్పందించిన ఇరాన్ తమ తీరాలపై లేదా ద్వీపాలపై ఏ దాడి జరిగినా, తీరం నుండి తేలియాడే మందుపాతరలతో సహా అన్ని గల్ఫ్ ప్రవేశ మార్గాల్లో నావికా మందు పాతరలను మోహరిస్తామని ఉన్నత స్థాయి భద్రతా సంస్థ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో ఈ దేశాల మధ్య శాంతి సంధి, కాల్పుల విరమణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ప్రపంచ ఇంధన మార్కెట్‌కు ధరల పరంగా మరిన్ని షాక్‌లు తగిలే ప్రమాదం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరా మరింత సంక్షోభంలో కూరుకుపోనుంది. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు 110 డాలర్ల వద్ద ఉంది.
ఇండియా పరిస్థితి
ఒకవేళ టెహ్రాన్, యుద్ధానికి ముందున్న సామర్థ్యంలో 50 శాతంతోనైనా ట్యాంకర్లను హోర్ముజ్ గుండా అనుమతిస్తే, కోట్లాది భారతీయ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు, కోట్లాది మంది పేదలకు ఊరట లభించినట్టే. ఇది ఇంధన ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి దోహదపడుతుంది. అలాగే బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళలలో జరగబోయే అత్యంత కీలకమైన ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీకి కూడా ఇది ఊపిరి పీల్చుకునే వెసులుబాటు కల్పించినట్టవుతుంది.
ట్రంప్ హెచ్చరికను ఇరాన్ లక్ష్య పెట్టకపోతే, వివిధ విద్యుత్ ప్లాంట్లపై దాడి చేసి, వాటిని పూర్తిగా నాశనం చేస్తాను, మొదటగా అతిపెద్ద ప్లాంట్‌తో ప్రారంభిస్తాను అన్న ట్రంప్ అదే పాటిస్తే యుద్ధం మరింత ముదిరి హోర్ముజ్ గుండా రవాణా అయ్యే చమురు గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచి పోవచ్చు. ఇది ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీస్తుంది. ధరలు ఆకాశాన్నంటుతాయి. ముఖ్యంగా ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు నాశనమవుతాయి.
మరోవైపు శత్రువులు కాని దేశాలకు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించవచ్చని ఇందుకోసం టెహ్రాన్‌తో సమన్వయం చేసుకోవాలని ఇరాన్ రక్షణ మండలి ఆదేశించినట్లు బీబీసీ నివేదించింది. హోర్ముజ్ జలసంధిలో సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించే ప్రయత్నంలో 22 దేశాలు చేరాయి
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) అధిపతి ప్రకారం, హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానాన్ని నిర్ధారించేందుకు కనీసం 22 దేశాలు అంగీకారానికి వచ్చాయి. నాటో సైనిక కూటమి సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే వెల్లడించిన ప్రకారం, నాటో సభ్య దేశాలతో పాటు జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల వంటి భాగస్వామ్య దేశాలతో సహా 22 దేశాలు ఈ ఇరుకైన జలమార్గంలో నౌకాయాన స్వేచ్ఛనునిర్ధారించడానికి తమ చర్యలను సన్నిహితంగా సమన్వయం చేసుకోవడానికి అంగీకరించాయి.
యుద్ధం ముగింపు గురించి మాట్లాడిన 24 గంటలలోపే ట్రంప్ ఈ బెదిరింపునకు పాల్పడటం, ఇరాన్ వైఖరితో ఈ యుద్ధం నుండి బయటపడే మార్గం లేదని భౌగోళిక రాజకీయ సైనిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


