పండుగ సెలవుల తర్వాత పార్లమెంటు ఉభయ సభలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మధ్యప్రాచ్యంలోని ప్రస్తుత పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో కీలక ప్రకటన,చేశారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 3.75 లక్షల మందికి పైగా భారతీయులు క్షేమంగా దేశానికి తీసుకొచ్చామని ప్రధాని మోదీ అన్నారు. ఒక్క ఇరాన్ నుంచే సుమారు 1,000 మంది భారతీయులు తిరిగి వచ్చారని తెలిపారు. అలాగే గల్ఫ్ దేశాలలో, కోటిమందికి పైగా నివసిస్తున్నారు. వారి కోసం 24/7 కంట్రోల్ రూమ్స్, హెల్ప్‌లైన్స్ ద్వారా సేవలందిస్తున్నామన్నారు. ఈ సంక్షోభ సమయంలో విదేశాలలో ఉన్న భారతీయుల భద్రతకే అత్యంత ప్రాధాన్యత నిచ్చినట్టు ప్రధాని స్పష్టం చేశారు
గృహ అవసరాల ఎల్‌పీజీకే ప్రాధాన్యత
గృహ అవసరాల ఎల్‌పీజీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామనీ, దేశీయంగా వంట గ్యాస్ ఉత్పత్తిని పెంచామని మోదీ స్పష్టం చేశారు. హార్మోజ్ జల సంధిలో ఇరుక్కున్న భారత్ నౌకలను సురక్షితంగా తీసుకు వచ్చామని మోదీ తెలిపారు. 41 దేశాల నుంచి చమురు, గ్యాస్, ఫర్టిలైజర్స్ తెప్పిస్తున్నామనీ. సురక్షిత నౌకా మార్గాలపై దృష్టిసారించామన్నారు. 53 లక్షల మెట్రిక్ టన్నుల ఇంధనం రిజర్వుగా ఉందని ఈ సందర్బంగా మోదీ తెలిపారు. పశ్చిమాసియాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. హర్మూజ్ జలసంధి ద్వారా గ్యాస్, క్రూడాయిల్ సరఫరా ఇబ్బందిగా మారింది. అయితే ఇంధన సమస్యలను అధిగమించేందుకు తమ ప్రభుత్వ కృషి చేస్తోందని మోదీ వెల్లడించారు. సాధ్యమైన ప్రతి చోటి నుంచీ చమురు, గ్యాస్ సరఫరాలను సేకరించ డానికి భారత్ ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. చమురు, గ్యాస్, ఎరువుల సరఫరాకు అంతరాయం లేకుండా కేంద్రం అన్ని రకాలుగా కృషి చేస్తోందన్నారు. బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టేలా కఠిన చర్యలు తీసు కోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాని మోదీ సూచించారు.
యుద్ధం ముగించి,శాంతిని నెలకొల్పాలి: మోదీ
యుద్ధం ముగించి,శాంతిని నెలకొల్పాలని కోరుతున్నాని మోదీ తెలిపారు.శాంతియుత సమాధానాన్ని తీసుకొచ్చేందుకు అందరు ప్రయత్నించాలని, దౌత్య, చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. యుద్ధం పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశామనీ, గల్ఫ్ దేశాధినేతలతో స్వయంగా మాట్టాడినట్టు మోదీ వెల్లడించారు. చమురు,మౌలిక వసతుల ప్రాజెక్టులపై దాడులను ఖండించామన్నారు. అలాగే ఈ సంక్షోభ పరిస్థితులను దుర్వినియోగం చేసే శక్తులపై చర్యలు తీసుకునేందుకు భద్రత బలగాలను అప్రమత్తం చేశామన్నారు. ఈ యుద్ధం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉంది. అందుకే దీన్ని గట్టిగా ఎదుర్కొనేందుకు అందరం ఐకమత్యంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు.
కోవిడ్ లాంటి సంక్షోభం : మోదీ ప్రధాని ప్రసంగంలో మరికొన్ని కీలక అంశాలు
- ప్రపంచ సంక్షోభాల భారం రైతులపై పడకుండా, ఎరువుల కోసం ఏర్పాట్లు.
- కీలకమైన ముడిసరుకుల విషయంలో నిల్వలను పెంచుకుంది.
- యుద్ధం, భారతదేశంలో వేసవి ఉష్ణోగ్రతల కారణంగా దేశంలో విద్యుత్ అవసరం పెరుగుతుంది
- ప్రస్తుతం, దేశంలోని అన్ని విద్యుత్ ప్లాంట్లలో తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయి.
- వరుసగా రెండో ఏడాది కూడా ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని నమోదు చేసింది.
- విద్యుత్ ఉత్పత్తి నుంచి సరఫరా వరకు అన్ని వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.
- మన పునరుత్పాదక బొగ్గు శక్తి 140 గిగావాట్లుగా ఉంది.
- గోవర్ధన్ యోజన కింద 40 లక్షలకు పైగా ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు
- ఈ యుద్ధ ప్రభావం దీర్ఘకాలికంగాఉంటుందని మోదీ హెచ్చరిక
- కోవిడ్ లాంటి సంక్షోభం, దీన్నిఅధిగమించడానికి దేశం మరోసారి ఏకం కావాలి
- గతంలో కూడా ఇలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాం. ఎప్పటిలాగానే ఐక్యంగా ఉండాలి.
కాగా అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో నిత్యావసర వస్తువుల సరఫరా, ఇంధన భద్రతను నిర్ధారించడానికి తీసుకోవాల్సిన దీర్ఘకాలిక, స్వల్పకాలిక చర్యలపై చర్చించేందుకు ప్రధాని మోదీ క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ (CCS) సమావేశం నిర్వహించిన ఒక రోజు తర్వాత మోదీ ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది.


