
వాషింగ్టన్: రష్యా-భారత్ వాణిజ్యంపై అమెరికా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక సహాయకుడు స్టీఫెన్ మిల్లర్.. భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్‌పై ఆ దేశం చేస్తున్న యుద్ధానికి భారత్ పరోక్షంగా నిధులు సమకూరుస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. యుద్ధం ఆగాలంటే భారత్‌పై ఆంక్షలు తప్పవని తేల్చి చెప్పారు. దీంతో, ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక సహాయకుడు స్టీఫెన్ మిల్లర్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత్ వాణిజ్యం కారణంగానే రష్యా ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగిస్తోంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తూ యుద్ధానికి ఆర్థికంగా మద్దతు ఇవ్వడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే విషయంలో భారత్ దాదాపుగా చైనాతో సమానంగా ఉంది. భారత్ చేసుకుంటున్న దిగుమతులు ఉక్రెయిన్‌పై రష్యా దాడికి నిధులు సమకూర్చడానికి సాయపడుతున్నాయి. ఇది అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది. ఈ విషయంలో అధ్యక్షుడు ట్రంప్ చాలా స్పష్టతతో ఉన్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక, ఆయన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
అయితే, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు కీలక భాగస్వామి అయిన భారత్‌పై ట్రంప్ వర్గం నుంచి ఇలాంటి విమర్శలు రావడం తీవ్ర చర్చకు దారి తీశాయి. కాగా, కొద్ది రోజుల ముందే ట్రంప్.. భారత వస్తువులపై 25 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. భారత్, రష్యా వాణిజ్యంపై ట్రంప్ ఆగ్రహం సైతం వ్యక్తం చేస్తూ డెడ్ ఎకానమీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా.. ఉక్రెయిన్‌లో శాంతి చర్చల దిశగా పురోగతి లేకపోతే, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 100 శాతం వరకు సుంకాలు విధిస్తామని ఆయన హెచ్చరించారు.
🚨 JUST IN: 🇺🇸🇮🇳 Stephen Miller, a top aide to President Trump, accused India of effectively financing Russia’s war in Ukraine by purchasing oil from Moscow. Miller made these remarks on Fox News " stating that it was “unacceptable” for India to continue buying Russian oil, which… pic.twitter.com/NYDbR6q7q1
— Viral Max (@viralmax777) August 3, 2025
ఇదిలా ఉండగా.. భారత్, తక్కువ ధరకే లభిస్తున్న రష్యా ముడి చమురుపై ఎక్కువగా ఆధారపడుతోంది. ప్రస్తుతం దేశ చమురు అవసరాల్లో మూడింట ఒక వంతుకు పైగా రష్యా నుంచే దిగుమతి చేసుకుంటోంది. అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ, దేశ ఇంధన భద్రత, సార్వభౌమ నిర్ణయాల దృష్ట్యా రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. అయితే, ట్రంప్‌కు, భారత ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య చారిత్రాత్మకంగా బలమైన స్నేహ సంబంధాలు ఉన్నాయని మిల్లర్ అంగీకరించడం గమనార్హం.