
న్యూఢ్లిల్లీ: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఇటీవల జరిగిన ఒక ఉగ్రవాది అంత్యక్రియల్లో యూటర్న్ తీసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌పై పలు ఆరోపణలు చేసిన పాకిస్తాన్ తన తీరు బయటకు పొక్కకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఒక ఉగ్రవాది అంత్యక్రియల సమయంలో చోటుచేసుకున్న పరిణామం ఇందుకు ఉదాహరణగా నిలిచింది.
ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లో మరణించిన ఉగ్రవాది హబీబ్ తాహిర్ అంత్యక్రియలు ఇటీవల పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని కుయియాన్ గ్రామంలో జరిగాయి. ఈ సందర్భంగా స్థానికంగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఎల్‌ఈటీ కమాండర్ రిజ్వాన్ హనీఫ్ సాయుధ వ్యక్తులతో అంత్యక్రియలకు రావడంతో, తాహిర్ కుటుంబ సభ్యులు, స్థానికులు వారిని అడ్డుకున్నారు. అయితే ఇంతలో హనీఫ్ మేనల్లుడు అక్కడ దుఃఖిస్తున్న వారిని తుపాకీతో బెదిరించడంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఇది స్థానికుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో హనీఫ్, అతని సహచరులు పోలీసుల జోక్యంతో అక్కడి నుండి వెళ్లిపోవాల్సి వచ్చింది.
ఇటీవలి కాలంలో పాక్‌లో ఉగ్రవాదులు నిర్వహించే కార్యక్రమాలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. ఉగ్రవాద గ్రూపులు చేపట్టే ప్రజా కార్యకలాపాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని చూస్తుంటే పాక్ ప్రభుత్వం బహిరంగంగా ఉగ్రవాదులను ప్రోత్సహించేందుకు వెనుకడుగు వేస్తున్నదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఆపరేషన్ సిందూర్ సమయంలో హతమైన ఎల్‌ఈటీ ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాకిస్తాన్ ఉన్నతాధికారుల పేర్లను భారతదేశం విడుదల చేసింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు ఎల్‌ఈటీ కమాండర్ అబ్దుల్ రవూఫ్ నాయకత్వం వహించారని భారత్ ఆరోపించింది.