
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న చమురుపై ట్రంప్ స్పందించారు. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇది మంచి చర్య.. భారత్ సరైన నిర్ణయం తీసుకుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘భారత్ ఇకపై రష్యా నుంచి చమురు కొనబోదని నేను అనుకుంటున్నాను. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, నేను విన్నది సరైందో కాదో నాకు తెలియదు. భారత్ కనుక ఇలా చేస్తే అది మంచి నిర్ణయం. ఏం జరుగుతుందో చూద్దాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
#WATCH | "I understand that India is no longer going to be buying oil from Russia. That's what I heard, I don't know if that's right or not. That is a good step. We will see what happens..." says, US President Donald Trump on a question by ANI, if he had a number in mind for the… pic.twitter.com/qAbGUkpE12
— ANI (@ANI) August 1, 2025
జైశ్వాల్ కీలక వ్యాఖ్యలు..
మరోవైపు, తాజా పరిణామాలపై భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏ దేశంతోనూ భారత్‌కు ఉన్న సంబంధాలను మూడో దేశం కోణంలో చూడవద్దని పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలుకు కట్టుబడి ఉన్నామని, అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా తమ నిర్ణయాలు ఉంటాయన్నారు. దేశ ఇంధన ప్రయోజనాలను కాపాడుకోవడంలో భాగంగా అంతర్జాతీయ మార్కెట్లో అత్యుత్తమంగా ఉన్న వాటిని ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తాం. పరస్పర ఆసక్తులు, ప్రజాస్వామ్య విలువలు, ప్రజల మధ్య బలమైన సంబంధాల విషయంలో భారత్, అమెరికా దేశాలు అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తాయి. ఇందులో ఇరు దేశాలు ఎన్నో మార్పులు, సవాళ్లను ఎదుర్కొన్నాయి. అందుకే ముఖ్యమైన ఎజెండాపైనే మేము దృష్టి సారించాం. ఈ భాగస్వామ్యం కొనసాగుతుందని విశ్వసిస్తున్నాం. భారత్, అమెరికా బలమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇవి బలోపేతమయ్యాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
నిలిచిన కొనుగోళ్లు..
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై పశ్చిమదేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కానీ, భారత్ మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై అమెరికా సహా పశ్చిమ దేశాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. అయితే, చమురు కొనుగోలుపై భారత్ ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తోంది. కాగా, దీన్ని ఓ కారణంగా చూపుతూ ఇటీవల ట్రంప్.. భారత్‌పై పెనాల్టీలు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను దేశీయ సంస్థ నిలిపివేశాయంటూ వార్తలు వస్తున్నాయి.

భారత్‌కు చెందిన ప్రభుత్వ చమురు శుద్ధి సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్ లిమిటెడ్ వంటి సంస్థలు గత వారం రోజులుగా మాస్కో నుంచి ముడిచమురు కొనుగోలు చేయడం లేదంటూ వార్తలు వచ్చాయి. రిఫైనరీ సంస్థలకు చెందిన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ కథనం ప్రచురించింది. అయితే, దీనిపై ఆయా సంస్థల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి స్పందించారు. ఇప్పటివరకు అలాంటి ఆదేశాలేమీ ప్రభుత్వం జారీ చేయలేదని వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.