
మాస్కో: అగ్ర రాజ్యాలు అమెరికా, రష్యా మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. అమెరికాకు చెందిన రెండు అణు జలాంతర్గాములను రష్యా సమీపంలో మోహరించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. అమెరికా చర్యలకు రష్యా కౌంటరిచ్చింది. అమెరికాను ఎదుర్కొనేందుకు తమవద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయని రష్యా హెచ్చరించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు రష్యాకు చేరువలోని సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను అమెరికా మోహరించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా రష్యా పార్లమెంటు సభ్యుడు విక్టర్ వోడోలాట్‌స్కీ స్పందిస్తూ.. అమెరికాను ఎదుర్కొనేందుకు రష్యా వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మహాసముద్రాల్లో అమెరికా జలాంతర్గాముల సంఖ్య కంటే రష్యావి చాలా ఎక్కువే ఉన్నాయి. అమెరికా మోహరించినవి జలాంతర్గాములు సైతం రష్యా జలాంతర్గాముల నియంత్రణలో ఉన్నాయనే విషయం గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు అంటూ కౌంటర్ ఇచ్చారు.
🚨 BREAKING:
Russian lawmaker Viktor Vodolatsky says Russia has enough nuclear submarines to counter the 2 U.S.
subs recently repositioned by President Trump.
The move follows provocative remarks from former Russian President Medvedev. #Defense #NuclearSubmarines #USRussia pic.twitter.com/QnsGLdx4Q5— India Defence Daily (@IndiaDefDaily) August 2, 2025
మరోవైపు.. గ్లోబల్ అఫైర్స్ మ్యాగజైన్ రష్యా ఎడిటర్ ఇన్‌చీఫ్ ఫ్యోడర్ లుక్యానోవ్ మాట్లాడుతూ.. ట్రంప్ హెచ్చరికలను ప్రస్తుతానికి తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు. అంతకుముందు మాస్కో, వాషింగ్టన్‌ల మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణలు జరగకూడదని యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాదనతో తాను ఏకీభవిస్తానని రష్యా విదేశాంగ మంత్రి సెర్గా లావ్‌రోవ్ పేర్కొన్నారు.
మెద్వెదెవ్ కామెంట్స్..
ఇదిలా ఉండగా.. శుక్రవారం అమెరికా రెండు అణు జలాంతర్గాములను రష్యా సమీపంలో మోహరించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహాయకుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ మెద్వెదెవ్ చేసిన ‘డెడ్ హ్యాండ్’ హెచ్చరికలకు ప్రతిస్పందనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్..‘అవి మతిలేని, రెచ్చగొట్టే ప్రకటనలు. నిజంగానే అలాంటి పరిస్థితి తలెత్తే ఆస్కారముంటే దీటుగా స్పందించేందుకే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. రెండు సబ్‌మెరైన్లను సరైన ప్రదేశాల్లో మోహరించాల్సిందిగా ఆదేశించాను’ అని వివరించారు.
ఏమిటీ డెడ్ హ్యాండ్?
ఇది రష్యా (నాటి సోవియట్ యూనియన్) అభివృద్ధి చేసిన ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి వ్యవస్థ. ఆ దేశంపై ఎవరన్నా అణు దాడి చేస్తే అందుకు ప్రతిగా ఆటోమేటిక్‌గా అణు దాడులు జరుపుతుంది. దేశ నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకు పోయినా తనంత తానుగా స్పందించి దాడులకు దిగటం దీని ప్రత్యేకత.