
భూమికి తిరిగొచ్చినప్పుడు అనుభవాన్ని వివరించిన శుభాంశు శుక్లా
వాషింగ్టన్: యాగ్జియం స్పేస్ మిషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న భారతీయ వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మొదటిసారిగా మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని భార రహిత స్థితిలో గడిపి భూమిపైకి వచ్చిన తర్వాత భూగురుత్వాకర్షణ శక్తికి అలవాటు పడే క్రమంలో ఎదురైన ఇబ్బందులను ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. గురుత్వాకర్షణ శక్తి ఎంత అవసరమో భూమిని వీడాకనే తమకు తెలిసిందన్నారు.
‘ఒక్కసారిగా భార రహిత స్థితిలోకి మారిపోగా దానికి అలవాటు పడేందుకు కొంత సమయం పట్టింది. అదేవిధంగా, భూమికి తిరిగొచ్చాక కూడా తిరిగి గురుత్వాకర్షణ శక్తికి అలవాటు పడాల్సి వచ్చింది’ అని వివరించారు. క్యాప్సూ్యల్‌లోంచి బయటకు వచ్చాక సెల్ ఫోన్ సైతం పట్టుకోలేనంత బరువుగా మారిపోవడం తనకు ఆశ్చర్యం వేసిందని తెలిపారు. భూమి పైకి వచ్చిన కొన్ని వారాల తర్వాత సైతం అడ్జెస్ట్ కావడం కష్టమవుతుందని, పడిపోకుండా నిలబడటం, అడుగులు వేయడం సైతం ఇబ్బందిగానే ఉంటుందని చెప్పారు.
అందుకే, వ్యోమగాములకు ప్రత్యేక రిహాబిలిటేషన్ కార్యక్రమం ద్వారా బలం కూడదీసుకోవడం, శరీర అవయవాల సమన్వయం, బ్యాలెన్స్ వంటివి ఒక్కటొక్కటిగా అలవాటయ్యాయన్నారు. అంతరిక్షంలో ఉన్నప్పటి మాదిరిగానే వదిలేసిన ల్యాప్‌టాప్ గాల్లోనే తేలియాడుతుందని భావించి, రూంలోనే దాన్ని పడేశాన ని ఆయన గుర్తు చేసుకున్నారు. అంతరిక్షంలో శూన్య గురుత్వాకర్షణ శక్తిలో అన్నీ తేలియాడుతూనే ఉంటాయి. అటువంటి భారరహిత స్థితిలోనే తనకు అప్పగించిన ప్రయోగాలన్నిటినీ విజయవంతంగా నెరవేర్చానన్నారు. ‘ఇప్పుడంతా మునుపటిలాగానే మారిపోయింది. మరో స్పేస్ మిషన్‌కు సిద్ధంగా ఉన్నా’అంటూ ఆయన ప్రకటించారు. శుభాంశు అంతరిక్ష కేంద్రంలో ఉంటూ చేపట్టిన ప్రయోగాల డేటా, సేకరించిన నమూనాలు ఇప్పటికే అమెరికా నుంచి భారత్‌లోని పరిశోధన శాలలకు చేరాయి. త్వరలో భారత్‌కు రానున్న శుభాంశు శుక్లా ఆ ప్రయోగాల గురించి శాస్త్రవేత్తలకు వివరించనున్నారు.