
ఢిల్లీ పోలీసుల నిర్లక్ష్యంపై సుప్రీం ఆగ్రహం
పోలీస్ కమిషనర్‌ను సైతం వదిలేది లేదని హెచ్చరిక
ఇంటర్‌పోల్ సాయం తీసుకుని, బాలుడిని తీసుకురావాలని ఆదేశం
న్యూఢిల్లీ: భర్త నుంచి విడిపోయిన రష్యా మహిళ, చిన్నారితోపాటు దేశం విడిచి వెళ్లిపోవడంపై సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులకు తలంటింది. పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని మండిపడింది. మైనర్‌ను రష్యా నుంచి తిరిగి తీసుకువచ్చేందుకు అక్కడి భారత ఎంబసీతో సంప్రదింపులు జరపాలని ఆదేశించింది.
చిన్నారి కస్టడీ విషయంలో రష్యా మహిళ కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగి్చల ధర్మాసనం మే 22వ తేదీన ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అయినప్పటికీ, ఆమె దేశం విడిచి నేపాల్ మీదుగా రష్యా వెళ్లిపోయినట్లుగా తెలవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ పోలీసుల పూర్తి నిర్లక్ష్యం, వైఫల్యమని పేర్కొంది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులతోపాటు విదేశాంగ శాఖ కూడా దీన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారని వ్యాఖ్యానించింది. కానీ, చిన్న వివాదం ఏమాత్రం కాదని పేర్కొంది.
‘ఆ బిడ్డను ఈ కోర్టు కస్టడీ నుంచి తల్లి తీసుకుంది. ఇది పిల్లలు తల్లిదండ్రుల మధ్య కస్టోడియల్ వివాదం కేసు కాదు. ఆ బాలుడి సంరక్షణ బాధ్యతను తండ్రికి, తల్లికీ కూడా అప్పగించలేదు. దేశం తరఫున అతడి సంరక్షకుడిగా ఉంటూ సమస్యను పరిష్కరించేందుకు ప్రయతి్నస్తున్నాం. ఆ పిల్లవాడు ప్రస్తుతం కోర్టు కస్టడీలో ఉన్నాడు’అని ధర్మాసనం వెల్లడించింది. ఈ పరిణామానికి కారణమైన స్థానిక స్టేషన్ హౌస్ అధికారి(ఎస్‌హెచ్‌వో), డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ)లనే కాదు, అవసరమైతే పోలీస్ కమిషనర్‌కు సైతం సమన్లు జారీ చేస్తామని తీవ్ర స్వరంతో హెచ్చరించింది.
‘తల్లి కదలికలపై కన్నేసి ఉంచేందుకు మహిళా పోలీసు అధికారులను నియమించాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే, స్థానికుల సాయంతో, పారదర్శకతతో వ్యవహరిస్తూ ఆ మహిళ ఇంట్లోకి ప్రవేశించడానికి సైతం అనుమతిచ్చాం. అయినప్పటికీ ఆమె బిడ్డతోపాటు ఇంటిని ఎలా వదిలి వెళ్లగలిగింది?’అని ఢిల్లీ పోలీసుల తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని ధర్మాసనం ప్రశ్నించింది. నేపాల్, యూఏఈ, రష్యా వైమానిక సంస్థలను సంప్రదించగా వారు వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశమంటూ ఎలాంటి సమాచారమూ తమకు ఇవ్వలేదని ఐశ్వర్య భాటి తెలిపారు.
‘నేర పూరిత చర్యలకు వ్యక్తిగత గోప్యతనేది వర్తించదు. ఢిల్లీ నుంచి బిహార్ ద్వారా అతి కష్టమైన రోడ్డు మార్గం ద్వారా నేపాల్‌కు చేరుకుంది. అక్కడ నాలుగు రోజు లు మకాం వేసింది. అయినా ఢిల్లీ పోలీసులు పట్టించుకోలేదు. కోర్టు వద్ద అసలైన పత్రాలుండటంతో ఆమె ఫోర్జరీ పత్రాలతో నేపాల్ వెళ్లినా ఢిల్లీ పోలీసులు అడ్డుకోలేదు’అంటూ ధర్మాసనం మండిపడింది. ఈ విషయంలో ఇంటర్‌పోల్ సాయం తీసుకోవాలని, అవస రమైన ఆదేశాలను తాము జారీ చేస్తామని ఐశ్వర్య భాటికి తెలిపింది. చిన్నారిని వెనక్కి తీసుకువచ్చే విషయంలో తీసుకున్న చర్యల పురోగతిపై పది రోజుల్లో నివేదికను అందించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.
రష్యా మహిళ చిన్నారి సహా దేశం విడిచి నేపాల్, షార్జాల మీదుగా వెళ్లిపోయి ఉంటుందని జూ లై 21న జరిగిన విచారణ సందర్భంగా కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. నేపథ్యమిదీ..భారత్‌కు చెందిన వ్యక్తి రష్యా మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆమె 2019 నుంచి ఎక్స్–1 వీసాపై ఢిల్లీలోనే ఉంటోంది. కుమారుడు పుట్టాక వారి మధ్య విభేదాలొచ్చాయి. కోర్టు సూచన మేరకు బాలుడి సంరక్షణ బాధ్యతను వారంలో చెరి సగం పంచుకున్నారు. కొన్నాళ్లు సరిగానే ఈ వ్యవహారం నడిచినా అకస్మాత్తు గా ఆ మహిళ, చిన్నారి సహా కనిపించకుండా పోవడంతో ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.