థ్వాయిట్స్‌ హిమానీనదం.. కరిగిపోతే ప్రళయమే!

Thwaites Glacier Could Raise The Sea Level By Several Meters - Sakshi

వేగంగా అంతర్ధానమవుతున్న థ్వాయిట్స్‌ హిమానీనదం

అది మాయమైతే 3 మీటర్ల మేర పెరగనున్న సముద్ర మట్టం

అదే జరిగితే తీర ప్రజలకు, ఆవాసాలకు పెనుముప్పే 

సాక్షి, నేషనల్‌ డెస్క్‌: థ్వాయిట్స్‌ హిమానీనదం. అంటార్కిటికా ఖండం పశ్చిమ భాగంలోని అత్యంత భారీ మంచు కొండ. వైశాల్యం ఎంతంటే.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర వైశాల్యంతో సమానం. శతాబ్దాలుగా స్థిరంగా నిలిచి ఉన్న థ్వాయిట్స్‌ కొంతకాలంగా వాతావరణ మార్పుల కారణంగా శరవేగంగా కరిగిపోతోందట. ఎంతలా అంటే ఇప్పుడిది మునివేళ్లపై నిలబడి ఉందట! అందుకే శాస్తవేత్తలు థ్వాయిట్స్‌కు ప్రళయకాల హిమానీనదం (డూమ్స్‌డే గ్లేసియర్‌) అని మరోపేరు పెట్టారు. ఈ గ్లేసియర్‌తోపాటు సమీప ప్రాంతాల్లోని మంచు మొత్తం కరిగిపోతే ప్రపంచమంతటా సముద్ర మట్టం ఏకంగా 3 మీటర్ల మేర పెరిగి, తీర ప్రాంతాలు చాలావరకు నీట మునిగి నామరూపాల్లేకుండా పోతాయని హెచ్చరిస్తున్నారు.

థ్వాయిట్స్‌ తాజా స్థితిగతులపై అమెరికా, యూకే, స్వీడన్‌ సైంటిస్టులు సంయుక్తంగా అధ్యయనం చేశారు. గత 200 ఏళ్లలో కరిగిన దానికంటే ఇప్పుడు రెండింతలు ఎక్కువ వేగంగా కరిగిపోతున్నట్లు గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను ‘నేచర్‌ జియోసైన్స్‌’ పత్రికలో ప్రచురించారు. సైంటిస్టులు అత్యాధునిక పరికరాలతో థ్వాయిట్స్‌ గ్లేసియర్‌ పరిమాణాన్ని గణించారు. ప్రతిఏటా 1.3 మేళ్లకుపైగా(2.1 కిలోమీటర్ల) కరిగిపోతున్నట్లు  తేల్చారు.

‘‘గ్లేసియర్‌ చివరి దశకు చేరుకుంటోందని చెప్పొచ్చు. సమీప భవిష్యత్తులో పెద్ద మార్పులను మనం అంచనా వేయొచ్చు’’ అని బ్రిటిష్‌ అంటార్కిటిక్‌ సర్వేకు చెందిన మెరైన్‌ జియోఫిజిసిస్ట్‌ రాబర్ట్‌ లార్టర్‌ చెప్పారు. ఐరాస సమాచారం ప్రకారం ప్రపంచ జనాభాలో 40 శాతం సముద్ర తీరాలకు 60 మైళ్ల పరిధిలోనే నివసిస్తున్నారు. సముద్ర మట్టం పెరిగితే సమీపంలోని ఆవాసాలు మునిగిపోతాయి. మనుషులకు, ఇతర జీవజాలానికి పెను ముప్పు తప్పదు.

గ్రేట్‌ బ్రిటన్‌ అంత పెద్దది!
పశ్చిమ అంటార్కిటికాలోని థ్వాయిట్స్‌ గ్లేసియర్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) మొత్తం పరిమాణం కంటే కొంత తక్కువ పరిమాణంలో ఉంటుంది. అమెరికాలోని వాషింగ్టన్‌ రాష్ట్రంతో దాదాపు సమాన పరిమాణంలో ఉంటుంది.  

► గ్లేసియర్‌ మొత్తం చుట్టుకొలత 74,131 చదరపు మైళ్లు(1,92,000 చదరపు కిలోమీటర్లు). అంటే గ్రేట్‌ బ్రిటన్‌ చుట్టుకొలతతో సమానం.  

► ఇక దీని మందం ఎంతంటే 4,000 మీటర్లు (13,100 అడుగులు). ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాల పెరుగుదలలో థ్వాయిట్స్‌ వాటానే అధికం.     

► థ్వాయిట్స్‌ మొత్తం మందం 4 కిలోమీటర్లు కాగా, ఇందులో రెండు కిలోమీటర్లకు పైగా సముద్ర ఉపరితలం నుంచి దిగువ భాగాన ఉంది.  

► థ్వాయిట్స్‌ హిమానీనదం పూర్తిగా కరిగిపోతే ప్రపంచవ్యాప్తంగా సముద్ర నీటిమట్టం దాదాపు మూడు మీటర్ల మేర(10 అడుగులు) పెరుగుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

ఇదీ చదవండి: 1.8 మిలియన్ల ఏళ్ల నాటి మానవ దంతం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top