
హిమాలయాల్లో ఠారెత్తిస్తున్న ఆకస్మిక వరదలు
గ్లోబల్ వార్మింగ్‌తో కరిగిపోతున్న మంచు
సహజ ప్రవాహాలకు ఆటంకంగా నిర్మాణాలు
ప్రకృతి ఏదీ అట్టిపెట్టుకోదు. మనం ఏదిస్తే దాన్నే అంతకుమించి తిరిగిచ్చేస్తుంది. పర్వతాలకు ఇది మరింతగా వర్తిస్తుంది. అభివృద్ధి పేరుతో చేస్తున్న విధ్వంసానికి ప్రకృతి ప్రతిస్పందనగా తాజాగా దేశవ్యాప్తంగా సంభవిస్తున్న విపత్తులే ఇందుకు నిదర్శనం. వాతావరణ మార్పులకు మానవవ తప్పిదాలు తోడై హిమాలయాలను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.
ఆగస్టు 5న ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ ధరాలీ గ్రామాన్ని నామరూపాల్లేకుండా చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఇటీవల భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. జమ్మూకశ్మీర్‌లోని కిష్త్‌వాడ్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ బీభత్సానికి ఏకంగా 65 మందికి పైగా బలయ్యారు. తాజాగా కశ్మీర్‌లోని కథువాలోనూ అదే పరిస్థితి! భారీ పరిమాణం, నిటారుగా ఉండే స్వరూపం హిమాలయాల్లో ఆకస్మిక, తీవ్ర వరదలకు దారి తీస్తుంటుంది.
వీటికి గ్లోబల్ వార్మింగ్ తోడైంది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో తరచూ వరదలొస్తున్నాయి. అటవీ నిర్మూలన, భూ వినియోగంలో మార్పులు సమస్య తీవ్రతను పెంచుతున్నట్టు సైంటిఫిక్ రిపోర్ట్స్ అధ్య యనం తేల్చింది. ధరాలి వరదలకు హిమనీ సరస్సు విరుచుకుపడటమే కారణమని నిపుణులు అంటున్నారు.
2013లో కేదార్‌నాథ్‌లో వేలాది మంది బలైన వరదలకు హిమనీ సరస్సు ఉప్పొంగడమే కారణం. 2023లో న్యూకాజిల్ వర్సిటీ అధ్యయనం ప్రకారం 2006 నుంచి 2016 మధ్య ప్రపంచంలో ఏటా ఏకంగా 332 గిగాటన్నుల మంచు కరిగిపోయింది. దీనివల్ల 1990 నుంచి ప్రపంచవ్యాప్తంగా హిమానీ సరస్సుల సంఖ్య 50 శాతం పెరిగింది. ఇది దిగువ ఉండేవారికి పెను ముప్పేనని అధ్యయనం వెల్లడించింది.
డేటాకే దిక్కు లేదు: భారత్‌లో వర్షపాతం, ఉష్ణోగ్రత, తేమ తదితరాలపై డేటా సేకరణ ఉంది. కానీ హిమాలయాలపై లేదు. ప్రత్యేకించి హిమనీనదాల ఔట్ బరస్ట్‌కు సంబంధించి అసలే లేదు. అక్కడ 28,000 సరస్సులున్నాయని హిమనీనద సరస్సులపై ఇస్రో జాబితా చెబుతోంది. 25 హెక్టార్లకంటే ఎక్కువ విస్తీర్ణమున్న సరస్సులనే ఇస్రో పర్యవేక్షిస్తోంది. ముప్పుకు కారణంగా మారుతున్న చిన్న సరస్సులెన్నో ఉన్నాయి.
అభివృద్ధి పనులు, రోడ్లు, వంతెనల నిర్మాణం, ఆవాసాల విస్తరణ. ఇళ్ళు, హోటళ్ళు, లాడ్జీల వంటివి ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ఇటీవల ప్రమాదం జరిగిన ధరాలిలో 1996లో నాలుగు భవనాలే ఉన్నాయి. ఇప్పుడక్కడ ఎటు చూసినా ఇళ్లు, లాడ్జీలు, దుకాణాలు, హోటళ్లు, రిసార్టులే! పైగా వాటన్నింటినీ వాలు ప్రాంతాల్లో నిర్మించారు! ఇది అత్యంత ప్రమాదకరమని హిమాలయాల్లో ప్రాకృతిక విపత్తులను అధ్యయనం చేస్తున్న జర్మనీ శాస్త్రవేత్త వోల్ఫ్‌గ్యాంగ్ ష్వాంగ్‌హార్ట్ తెలిపారు.
అటవీ నిర్మూలన
2013లో కేదార్‌నాథ్ వరదల తర్వాత ఉత్తరాఖండ్‌ల నదీతీరాల వెంబడి నిర్మాణాలను నిషేధించారు. తర్వాత దాన్ని బేఖాతరు చేస్తూ భవనాలు, హోటళ్లను పునరి్నర్మించారు. పైగా జలవిద్యుత్ ప్రాజెక్టులు, జాతీయ రహదారుల ప్రాజెక్టుల కోసం పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఝాలా–జంగ్లా మార్గంలో ‘చార్ ధామ్ పరియోజన’లో భాగంగా ఏకంగా 6 వేల హిమాలయ దేవదారు వృక్షాలను నరికేశారు. ఇందులో 10 కి.మీ. పరిధిలో నిషేధాలు నిషిద్ధం! దేవదారు వృక్షాల నరికివేత వల్ల వాలు ప్రాంతాలు అస్థిరమవుతాయని నిపుణులు హెచ్చరించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్