
మానవ కార్యకలాపాలతో దుష్ప్రభావాలు
కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల వేడెక్కుతున్న సాగరాలు
అంతరించిపోతున్న జీవజాలం.. తగ్గుతున్న ఉపాధి అవకాశాలు
దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే 2050 నాటికి ఈ నష్టం రెండింతలు
యూరప్‌లో జరిగిన తాజా అధ్యయనంలో వెల్లడి
భూగోళంపై అన్ని రకాల జీవుల మనుగడకు సముద్రాలు అత్యంత కీలకం. జీవులకు అవసరమైన ప్రాణవాయువును సముద్రాలే అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. కోట్లాది మంది జీవనోపాధి కల్పిస్తున్నాయి. అంతేకాకుండా ప్రపంచ 90 శాతం వాణిజ్యం సముద్ర మార్గాల ద్వారానే జరుగుతోంది. అయితే, ఆధునిక కాలంలో మానవ కార్యకలాపాల వల్ల అవి పెనుముప్పును ఎదుర్కొంటున్నాయి.
మనుషుల వల్ల నానాటికీ పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు శాపంగా మారుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి సముద్రాలపై మనుషుల దుష్ప్రభాభావం రెండు రెట్లు పెరుగుతుందని యూరప్‌లో తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఈ వివరాలను ‘సైన్స్’ పత్రికలో ప్రచురించారు. కాలుష్యం, తద్వారా అధిక ఉష్ణోగ్రతల వల్ల సముద్రాలు క్రమంగా వేడెక్కుతున్నాయి.
వాటిలోని జీవజాలం నశించిపోతోంది. మరోవైపు సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఆమ్ల ప్రభావంతో సముద్ర జలాలు మరింత ఉప్పుగా మారుతున్నాయి. మొత్తానికి సముద్ర జీవావరణ వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆహ్లాదం పంచే సముద్రాలు ప్రమాదం ముంగిట ఉన్నట్లు అధ్యయనకర్త బెన్ హల్‌పెర్న్ వెల్లడించారు.
భూమిపై మనుషుల కార్యకలాపాల వల్ల సముద్రాలకు ఇప్పటికే చాలా నష్టం జరిగిందని, ఇప్పటికైనా మేల్కొనకపోతే 2050 నాటికి ఈ నష్టం రెండింతలు అవుతుందని తేల్చిచెప్పారు. ఇది నిజంగా ఊహించని పరిణామం అని పేర్కొన్నారు. సముద్రాలపై ప్రతికూల ప్రభావాలు వేగంగా పెరుగుతుండడమే అసలు సమస్య అని వివరించారు.
కోలుకోలేని దశకు జీవావరణ వ్యవస్థ
సముద్రాలపై వాతావరణ ప్రభావాలే తప్ప మనుషుల ప్రభావం అంతగా ఉండదని ఇన్నాళ్లూ భావించారు. భూమిపై జనవాసాల కంటే సముద్రాల విస్తీర్ణం ఎన్నో రెట్లు ఎక్కువ కాబట్టి ఇలాంటి అంచనాకొచ్చారు. కానీ, మనుషుల ప్రభావం గణనీయంగా ఉంటున్నట్లు తేలింది.
ఉష్ణోగ్రతల పెరుగుదలతో సముద్రాలు వేడెక్కుతుండడం ఒక అంశమైతే.. నియంత్రణ లేని చేపల వేట, సముద్ర వాణిజ్యం వంటివి సమస్య తీవ్రతను మరింత పెంచుతున్నట్లు వెల్లడయ్యింది. మానవుల చర్యల వల్ల సముద్రాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఉష్ణమండల ప్రాంతాలతోపాటు ధ్రువ ప్రాంతాల్లో జీవావరణ వ్యవస్థ ఇప్పటికే కోలుకోలేని దశకు చేరుకుంది.
పగడపు దిబ్బలు, మడ అడవులు ధ్వంసం
ఆధునిక కాలంలో సముద్ర తీర ప్రాంతాలు సైతం సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. పగడపు దిబ్బలు అంతరించిపోతున్నాయి. మడ అడవులు ధ్వంసమవుతున్నాయి. కాలుష్యం కారణంగా సముద్ర జీవుల వృద్ధికి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. సముద్రాల్లోకి స్వచ్ఛమైన జలం కాకుండా మురికి నీరు చేరుతోంది. స్వచ్ఛమైన జలం, సముద్ర జలం మధ్య సమతూకంలో ప్రతికూల మార్పులు వస్తున్నాయి.
ఇవన్నీ సముద్రాలకు నష్టం చేకూర్చడంతోపాటు స్థానికంగా జీవనోపాధి అవకాశాలు తగ్గిపోవడానికి కారణమవుతున్నాయి. ఫలితంగా ఆహారం, ఉపాధి కోసం సముద్రాలపై ఆధారపడే దేశాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఈ ముప్పు మరింత పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం లేదని నిపుణులు తేల్చిచెబుతున్నారు.
ముప్పు తప్పించుకోవాలంటే వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించాలని, సముద్రాల్లో చేపల వేట నియంత్రణ చర్యలను బలోపేతం చేయాలని, సముద్ర వాణిజ్యంలోనూ నియంత్రణ అవసరమని అంటున్నారు. భవిష్యత్తు వైపు దృష్టిసారిస్తే ఇప్పుడు మనమేం చేయాలో తెలుస్తుందని బెన్ హల్‌పెర్న్ హితవు పలికారు. భవిష్యత్తును నాశనం చేసుకోవాలా? లేక కాపాడుకోవాలా? అనేది మన చేతుల్లోనే ఉందన్నారు.
ముక్కలైన మంచు కొండ
ప్రపంచంలోనే అతిపెద్ద మంచు కొండగా రికార్డుకెక్కిన ఏ23ఏ ఐస్‌బర్గ్ విచ్ఛిన్నమైపోయింది. తన రికార్డును కోల్పోయింది. ఈ ఐస్‌బర్గ్ ముక్కలుగా విడిపోయింది. మరికొన్ని వారాల్లోనే పూర్తిగా చెదిరిపోయే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్పారు. ఏ23ఏ ఐస్‌బర్గ్ అమెరికాలోని రోడ్ ఐలాండ్ స్టేట్ విస్తీర్ణంతో సమానంగా ఉండేది. దీని బరువు లక్ష కోట్ల టన్నుల పైమాటే. అంటార్కిటికాలో 1986లో ఏర్పడింది. దక్షిణ అట్లాంటిక్ సముద్రంలోని సౌత్ జార్జియా దీవి వైపు ప్రయాణిస్తూ ముక్కలైంది.
ప్రస్తుతం ఇది హూస్టన్‌స్టేట్ విస్తీర్ణానికి తగ్గిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద మంచు కొండగా డీ15ఏ ఐస్‌బర్గ్ రికార్డుకెక్కింది. ఏ23ఏ నుంచి విడిపోయిన మంచు ముక్కలకు ఏ23డీ, ఏ23ఈ, ఏ23ఎఫ్ అనే పేర్లు పెట్టారు. కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా సముద్రం వేడెక్కడం వల్ల ఏ23ఏ ఐస్‌బర్గ్ విచి్ఛన్నమైనట్లు సైంటిస్టులు స్పష్టంచేశారు. ఇలా మంచు కొండలు ముక్కలై కరిగిపోతే సముద్ర మట్టాలు పెరిగే ప్రమాదం ఉంటుంది.
– సాక్షి, నేషనల్ డెస్క్